సమంత కొత్త జీవితం..!
* బాలీవుడ్‌కు షాక్ ఇచ్చిన టాలీవుడ్ క్వీన్.
• స్టార్ హీరోయిన్ రహస్య వివాహం.
* సమంత రెండో పెళ్లి, రాజ్ నిడిమోరుతో కొత్త బంధం.
హైదరాబాద్, మహా.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా రెండో వివాహం చేసుకుందన్న వార్త టాలీవుడ్, బాలీవుడ్ సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న ప్రముఖ డైరెక్టర్-రైటర్ రాజ్ నిడిమోరును ఆమె సోమవారం రహస్యంగా వివాహమాడింది. కోయంబత్తూర్‌లోని ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు ధ్రువీకరించాయి. మాజీ భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సుదీర్ఘ విరామం అనంతరం సమంత తీసుకున్న ఈ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, ఆమె కొత్త జీవిత భాగస్వామి, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ రాజ్ నిడిమోరు నేపథ్యం, సినీ ప్రస్థానంపై నెటిజన్లు ఆసక్తిగా గాలిస్తున్నారు.
” తిరుపతి నుంచి అమెరికా దాకా.. రాజ్ నిడిమోరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి బాలీవుడ్ డైరెక్టర్‌గా..*
రాజ్ నిడిమోరు మన తెలుగు వ్యక్తే కావడం విశేషం. 1975 ఆగస్టు 4న తిరుపతిలో జన్మించిన రాజ్, అక్కడి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీ.టెక్ పట్టా పొందారు. ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లిన ఆయన అక్కడ కొన్నాళ్లపాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఉద్యోగంలో స్థిరపడినప్పటికీ, సినిమాపై ఉన్న మమకారం ఆయనను వదలలేదు. అందుకే, సాఫ్ట్‌వేర్ కొలువు వదిలి, తనలాగే సినిమాపై ఆసక్తి ఉన్న కృష్ణ డీకే (కృష్ణ దాసరి కొత్తపల్లి)తో జతకట్టారు. ఈ ద్వయం *’రాజ్ అండ్ డీకే’*గా ప్రసిద్ధి చెందింది. వీరిద్దరూ కలిసి రూపొందించిన మొదటి షార్ట్ ఫిల్మ్ ‘షాదీ.కామ్’ 2002లో విడుదలైంది. ఆ తర్వాత 2003లో ఇంగ్లీష్ చిత్రం ‘ఫ్లేవర్స్’ను డైరెక్ట్ చేశారు.
** ‘గో గోవా గాన్’ నుంచి ‘ఫ్యామిలీ మ్యాన్’ దాకా**
రాజ్ అండ్ డీకే బాలీవుడ్‌లో 2009లో ’99’ అనే చిత్రంతో అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘షోర్ ఇన్ ది సిటీ’తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా, జోంబీ-కామెడీగా తెరకెక్కిన ‘గో గోవా గాన్’ వీరిద్దరికీ స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. వీరు తెలుగులో 2013లో వచ్చిన ‘డీ ఫర్ దోపిడీ’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ‘ఎ జెంటిల్ మ్యాన్’, భారీ విజయం సాధించిన ‘స్త్రీ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే, 2019లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ వీరి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత ‘సినిమా బండి’, ‘ఫర్జీ’, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘సిటాడెల్ హనీ బన్నీ’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ గా రాజ్ అండ్ డీకే పనిచేశారు. తెలుగు సినీ దిగ్గజాలలో రామ్ గోపాల్ వర్మ అంటే రాజ్ నిడిమోరుకు ప్రత్యేక అభిమానం.
** ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో మొదలైన పరిచయం.. సమంత-రాజ్ ప్రేమ బంధం**
సమంత, రాజ్ నిడిమోరుల ప్రేమకు అంకురార్పణ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ షూటింగ్‌లో జరిగింది. ఈ సిరీస్‌లో సమంత కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ‘సిటాడెల్ హనీ బన్నీ’ ప్రాజెక్టుకు కూడా పనిచేయడం, పలు సందర్భాలలో జంటగా కనిపించడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం వంటివి వీరి బంధంపై అనేక ఊహాగానాలకు దారితీశాయి. రాజ్ నిడిమోరు గతంలో శ్యామలి డేను పెళ్లాడి, 2022లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాతే సమంతతో స్నేహం ప్రేమగా మారింది. వీరు తమ రిలేషన్‌షిప్‌ను అఫీషియల్ చేయాలనుకుంటున్నారన్న టాక్ బలంగా వినిపించిన నేపథ్యంలో, ఎవరికీ తెలియకుండా వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టడం టాలీవుడ్‌ను కుదిపేసింది.
** రాజ్ నిడిమోరు నికర ఆస్తుల విలువ ఎంతంటే?**
దర్శకుడిగా, నిర్మాతగా రాజ్ నిడిమోరు భారీగానే ఆస్తులను పోగేసినట్టు సమాచారం. కొన్ని సంస్థల రిపోర్ట్స్ ప్రకారం, రాజ్ నిడిమోరుకి సుమారు $10.8 మిలియన్లు (దాదాపు ₹90 కోట్లు) విలువైన ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. మిత్రుడు డీకేతో కలిసి ఆయన డి 2 ఆర్అనే ఫిలిం ప్రొడక్షన్ కంపెనీని స్థాపించారు. ఈ బ్యానర్ కింద ‘ఫ్యామిలీ మాన్’, ‘గన్స్ అండ్ గులాబ్స్’, ‘సిటాడెల్’ వంటి విజయవంతమైన సిరీస్‌లతో పాటు పలు చిత్రాలను నిర్మించారు. అమెజాన్ వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలు వీరి సిరీస్‌ల కోసం ఒక్కో సీజన్‌కు సుమారు ₹60 కోట్ల వరకు చెల్లించాయని ప్రచారం ఉంది. అంతేకాక, నెట్‌ఫ్లిక్స్‌తో కూడా డీ2ఆర్ ప్రొడక్షన్‌కు ఒప్పందాలు ఉన్నాయి. ఈ భారీ సక్సెస్ ఫుల్ కెరీర్ నేపథ్యంతో, సమంతతో కలిసి రాజ్ నిడిమోరు కొత్త జీవితాన్ని ప్రారంభించడంపై సినీ వర్గాలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.








