Mahaa Daily Exclusive

  డిజిటల్ అరెస్టులపై సీబీఐని అనుమతించండి..

Share

  • డిజిటల్ అరెస్టులపై సీబీఐని అనుమతించండి
  • తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
  • గతంలో సీబీఐకి జనరల్ కన్సెట్ వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ, మహా : సైబర్ నేరస్థులను కట్టడి చేయడంతో పాటు నసైబర్ మోసాలకు పుల్ స్టాఫ్ పెట్టేందుకు సీబీఐకి పూర్తి స్థాయిలో సహకరించాలని తెలంగాఎణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. రోజు రోజుకూ తెలివి మీరిపోతున్న సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, ఒంటరివారు, డిజిటల్ అక్షరాస్యత లేని వారిని లక్ష్యంగా చేసుకుని రూ. లక్షలు కొల్లగొడుతున్నారు. ఈ మధ్య కాలంలో డిజిజల్ అరెస్ట్ ఘటనలు పెరిగిపోతున్నాయి. కేవలం భారత్‌లోని డిజిటల్ అరెస్ట్ బాధితుల నుంచి రూ. 3 వేల కోట్లు సైబర్ దొంగలు దోచుకోవడం ఆందోళనకరమని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంతో డిజిటల్ అరెస్టుల మోసాల విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. అందులో భాగంగా ఈ మోసాలపై సోమవారం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ విచారణకు అనుమతించాలని, డిజిటల్ అరెస్టులపై నమోదైన ఎఫ్ఐఆర్‌ల సమాచారాన్ని సీబీఐకి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

డిజిటల్ అరెస్టుల విషయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాంపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం.. సీబీఐని దర్యాప్తుకు ఆదేశించింది. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ సహా అన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. తమ వద్ద నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు సీబీఐకి అందించాలని తెలిపింది. తెలంగాణలో సీబీఐ నేరుగా వచ్చి దర్యాప్తు చేపట్టేందుకు అనుమతి లేదు. అందుకే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీ కోసం జనరల్ కన్సెంట్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని ఇప్పటికే సీబీఐని కోరింది. తాజాగా డిజిటల్ అరెస్టుల విషయంలో మిగతా రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా సీబీఐ దర్యాప్తుకు అనుమతి ఇచ్చి సహకరించాలని నోటీసుల్లో పేర్కొంది.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్‌బీఐ) కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించింది. సైబర్ మోసాలకు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలను ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించింది. డిజిటల్ అరెస్ట్ కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. మరోవైపు, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేయడంలో సహకారం అందించిన బ్యాంకు అధికారులను సైతం గుర్తించాలని సీబీఐకి సుప్రీం కోర్టు సూచించింది. విదేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్న నేరస్థులను పట్టుకునేందుకు ఇంటర్ పోల్ సాయం తీసుకోవాలని పేర్కొంది.