బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి ప్రేమ లేదు.
• సంక్షేమం కోసం ₹1.10 లక్షల కోట్లు ఖర్చు.
• ₹5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్.
• సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి.
* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
ఖమ్మం, మహా.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రేమ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీకి లేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సాయంత్రం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నూతి సత్యనారాయణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుల గణన చేపడతామని తమ నాయకులు రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సర్వే నిర్వహించి, అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్‌కు పంపామన్నారు. బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఆగిపోయిందని, దీనిని ఆమోదింపజేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి ధర్నా చేసి ప్రధానమంత్రిని కలిసే ప్రయత్నం చేశామని వివరించారు. పార్లమెంటు సమావేశాల్లో సైతం బీసీ రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలందరికీ సూచించారని తెలిపారు. ఏం చేయకుండానే అన్నీ చేశామని మాటలు చెప్పే బీఆర్‌ఎస్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు.
సంక్షేమంపై కోటి మహిళలకు సారే చీర పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కేవలం సంక్షేమ పథకాల కోసమే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం 1.10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని డిప్యూటీ సీఎం ప్రకటించారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున ఖర్చు చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మొదటి సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా 22 వేల కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు వివరించారు.
రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 13,500 కోట్ల భారం పడుతున్నా, పేదల కోసం వెనకడుగు వేసేది లేదన్నారు. ఇందిరా క్రాంతి పథకం కింద మహిళలకు సంవత్సరానికి రూ. 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెబితే అసాధ్యమని హేళన చేసినవారు, మొదటి సంవత్సరంలోనే రూ. 26 వేల కోట్ల రుణాలు పంపిణీ చేసి తాము అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని తెలిపారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ కోటి మంది మహిళలకు ఇంటింటికి బొట్టు పెట్టి సారే చీర పంపిణీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదని కొనియాడారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, 51 లక్షల కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్తు సరఫరా, రైతు భరోసా కింద సంవత్సరానికి రూ. 12,000 ఆర్థిక సహాయం, రూ. 2 లక్షల వరకు రుణమాఫీ కింద రూ. 21 వేల కోట్లు మాఫీ చేసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తు అందిస్తూ, ఈ భారం రూ. 12,500 కోట్లను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
అభివృద్ధి ..విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
దేశంలో ఎక్కడా లేని పూర్తిస్థాయి ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని మంగళవారం కొత్తగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ యూనివర్సిటీని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరిట నెలకొల్పడం జరిగిందని వివరించారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రపంచంతో పోటీపడేలా రూపొందించిన 2047 తెలంగాణ రైసింగ్ డాక్యుమెంట్ను ఈ నెల 9న ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ఈ భవిష్యత్తు ప్రణాళిక ఉపయోగపడుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో… గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నామని, రీ డిజైన్ పేరుతో ఆగిపోయిన రాజీవ్ ఇందిరా సాగర్ ప్రాజెక్టులకు రూ. 100 కోట్లు కేటాయించి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా ఎన్ఎస్‌పీ కాలువకు గోదావరి నీళ్లు పారిస్తున్నామని తెలిపారు.
పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని, ఏదో ఒక స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయాలు పక్కన పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, ప్రతి గ్రామాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.
నూతన అధ్యక్షుడికి అభినందనలు
ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన నూతి సత్యనారాయణ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కావడమే కాక, వారి కుటుంబం స్వతంత్ర సమరయోధుల కుటుంబమని డిప్యూటీ సీఎం కొనియాడారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో అన్ని వసతులతో కూడిన ఆధునిక కాంగ్రెస్ కార్యాలయం నిర్మాణానికి తెలంగాణ క్యాబినెట్ ఎకరం స్థలం కేటాయించిందని, మాజీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఇప్పటికే చెక్కు రూపంలో డబ్బులు చెల్లించారని తెలిపారు. త్వరలో నిర్మాణ కమిటీని ప్రకటించి నాయకులందరినీ భాగస్వాములుగా చేస్తామని డిప్యూటీ సీఎం వివరించారు.








