- పదేళ్లలో వందేళ్ల అభివృద్ధి
- 75 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డ పెత్తనం
- వడ్డించే వాడినే నేను.. పాలమూరుకు నిధులు కొదవలేదు
- పాలమూరుకు ప్రాణం ఇస్తా, మోసం చేస్తే పాతాళానికి తొక్కుతుంది
- ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక జిల్లాను పట్టించుకున్న సీఎంలు లేరు
- రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయకపోతే వీపు విమానం మోతే
- మక్తల్ ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మహబూబ్‌నగర్, మహా: మహబూబ్ నగర్ జిల్లా చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జిల్లాను పట్టించుకున్న ముఖ్యమంత్రులు ఎవరూ లేరంటూ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2023 డిసెంబరు 7న అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వంలో, పాలమూరు ప్రజలు ఆశీర్వదించి 12 మంది ఎమ్మెల్యేల బలగంతో పంపిస్తే తాను తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిని అయ్యానని తెలిపారు. ఈ సందర్భంగా, వచ్చే పదేళ్లలో ఈ జిల్లాను అన్ని రంగాల్లో వందేళ్ల అభివృద్ధికి సరిపడా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మక్తల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల’ తొలి సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, “వడ్డించే వాడినే నేను. జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవడానికి ఎన్ని నిధులైనా ఇస్తాను” అని హామీ ఇచ్చారు. అంతకు ముందు మంత్రులు వాకిటి శ్రీహరి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇంచార్జీ మంత్రి దామోదర రాజనర్సింహతో కలసి మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం సభా వేదిక వద్ద రూ. 1038 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రజా విజయోత్సవాల తొలి సభను వెనకబడిన మక్తల్‌లో ఏర్పాటు చేయడం తనకు సంతోషంగా ఉందని సీఎం తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణ ముఖ్యమంత్రి అయిన తర్వాత, మళ్లీ 75 ఏళ్ల తర్వాత తమ ఆశీర్వాదంతో పాలమూరు బిడ్డ సీఎం అయ్యాడని పేర్కొన్నారు. గతంలో జిల్లా నుంచి మంత్రులు ఎన్నికైనా ఆనాటి సీఎం చెప్పుచేతల్లో ఉండేవారని, కానీ ఇప్పుడు పాలమూరు ప్రజలు గెలిపించిన రైతు బిడ్డ సీఎం అయ్యాడని అన్నారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ఇప్పుడు సీఎం గా నిలబడ్డాడు. “పాలమూరు ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది. మోసం చేస్తే పాతాళానికి తొక్కుతుంది” అని వ్యాఖ్యానించిన సీఎం, 2009లో వలస వచ్చి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి (మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ) ఆశీర్వదించినా సీఎం అయ్యాక జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం తాము ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు చేసుకుంటుండగా, కోర్టులో కేసులు వేసి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో ఎకరాకు రూ. 14 లక్షలు సరిపోవడం లేదని మంత్రి శ్రీహరి కోరగా, తాను ఎకరాకు రూ. 20 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని, క్యాబినెట్ ఆమోదం పొందిందని వెల్లడించారు. దీనికి 96 శాతం రైతులు ఒప్పుకున్నారని, ఈ ప్రాజెక్టు ద్వారా లక్షా 15 వేల ఎకరాలకు నికర జలాలను వాడుకునే అవకాశం ఉందని, ఇది తన జీవితంలో గొప్ప సంతోషం అన్నారు.
ఈ ప్రాంతాన్ని పాడి పంటలతో నింపి దేశానికి ఆదర్శంగా తయారు చేయాలని పిలుపునిస్తూ, రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయక పోతే “వీపు విమానం మోత అవుతుంది” అంటూ అధికారులకు చురకలు అంటించారు. ఇరిగేషన్‌తో పాటు ఎడ్యుకేషన్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి పేదవాడి బిడ్డకు విద్యను అందించాలని ప్రతీ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను మంజూరు చేసి, ఒక్కో స్కూల్‌కు ₹200 కోట్లు కేటాయించామని తెలిపారు. 14 నియోజకవర్గాలకు ఆ స్కూల్స్ ఇచ్చామని, వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా బేధం చూపలేదని, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అడిగిన ఐఐటీని కూడా మంజూరు చేశామని తెలిపారు. మహిళలకు ప్రీ బస్, సన్న బియ్యం పంపిణీతో పాటు, నారాయణపేట మహిళలు అదానీ అంబానీతో పోటీ పడేలా సోలార్ విద్యుత్ తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. 35 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ పంచాయతీని, వందేళ్ల నుంచి కానీ బీసీ కుల గణనను పూర్తి చేశామని, రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇస్తున్నామని తెలిపారు. మీ పాలమూరు బిడ్డ రాష్ట్రానికి పెద్దకొడుకుగా గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి పనులు మంజూరు చేయించుకోగలిగే మంచి నాయకులను సర్పంచులుగా గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.







