ఖమ్మం, మహా.
హైదరాబాద్ నుండి ఖమ్మం జిల్లాకు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని ఆరు వాహనాలను ఎన్నికల అధికారులు సోమవారం రాత్రి తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో, నాయకన్ గూడెం వద్ద గల సింగరేణిపల్లి టోల్ ప్లాజా వద్ద ఈ ఆకస్మిక తనిఖీ జరిగింది.
ఖమ్మం సరిహద్దుల్లోని ఈ టోల్ ప్లాజా వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు భద్రతా ప్రోటోకాల్స్‌లో భాగమైన ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ఆరు వాహనాలను ఆపి, క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలో ఎలాంటి అభ్యంతరకర వస్తువులు లేదా నగదు లభించలేదని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ అయినప్పటికీ, ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కొత్తగూడెంలో జరిగే ప్రజాపాలన సంబరాలలో పాల్గొననున్నారు. ఆయన ఈ కార్యక్రమానికి హెలికాప్టర్ ద్వారా హాజరుకానుండగా, ఆయన పర్యటనకు సంబంధించిన ముందస్తు కాన్వాయ్ మాత్రం రోడ్డు మార్గంలో బయలుదేరిన క్రమంలోనే ఈ తనిఖీ జరిగింది. ఈ ఆకస్మిక చర్యతో టోల్ ప్లాజా వద్ద కొద్దిసేపు సందడి నెలకొంది.








