Mahaa Daily Exclusive

  త్వరలో అర్బన్ హౌసింగ్ పాలసీ:మంత్రి పొంగులేటి

Share

  • త్వరలో అర్బన్ హౌసింగ్ పాలసీ
  • మార్చిలోగా ల‌క్ష ఇళ్ళలో గృహ‌ప్రవేశాలు
  • జూన్ నాటికి మ‌రో రెండు ల‌క్ష‌లు
  • ఏప్రిల్ నుంచి రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇళ్ళ మంజూరు
  • మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఓఆర్ఆర్ చుట్టూ నిర్మాణం
  • మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్, మహా :-ఇందిర‌మ్మ ఇళ్ళ ప‌ధ‌కంలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు నాలుగు ల‌క్ష‌ల ఇళ్ళను మంజూరు చేశామ‌ని మూడు ల‌క్ష‌ల ఇళ్ళు వివిధ నిర్మాణ ద‌శ‌ల్లో ఉన్నాయ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. మార్చి నాటికి ల‌క్ష ఇందిర‌మ్మ ఇళ్ళకు గృహ ప్ర‌వేశాలు చేస్తామ‌ని ఆ త‌ర్వాత జూన్ నాటికి మ‌రో రెండు ల‌క్ష‌ల గృహ ప్ర‌వేశాలు జ‌రుగుతాయ‌ని ప్ర‌క‌టించారు. సచివాల‌యంలో శుక్ర‌వారం త‌న ఛాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో హౌసింగ్ శాఖ‌లో రెండేళ్ల ప్ర‌గ‌తిని వివ‌రించారు. జీహెచ్ఎంసీతో స‌హా అన్ని ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్ళ ప‌ధ‌కం మంజూరుకు ప్ర‌ణాళిక సిద్ద‌మైందని, జీ ప్ల‌స్ త్రీ ప‌ద్ద‌తిలో నిర్మించే గృహాల కోసం అతి కొద్ది రోజుల్లో పాల‌సీని ప్ర‌క‌టించ‌బోతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మధ్య త‌రగ‌తి ప్ర‌జ‌ల కోసం ప్ర‌భుత్వానికి లాభ న‌ష్టాలు లేకుండా స‌ర‌స‌మైన ధ‌ర‌కు ఇళ్ళను నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం ఓఆర్ఆర్ చుట్టూ నాలుగు స్ధ‌లాల‌ను గుర్తించడం జరిగిందని, ఒక్కో చోట 8 నుంచి 10 వేల ఇళ్ళు నిర్మించే ప్ర‌తిపాద‌న ఉందన్నారు.

గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో కూక‌ట్ ప‌ల్లి హౌసింగ్ బోర్డు ప‌రిధిలో గ‌తంలో నిర్మించిన ఇళ్ళు శిధిల‌మవుతున్న వాటిని తొల‌గించి హైరైజ్ అపార్ట్‌మెంట్‌ల నిర్మాణానికి అనుమ‌తి ఇవ్వాల‌న్న ఆలోచ‌న చేస్తున్నామని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం అసంపూర్తిగా వ‌దిలేసిన 2 బిహెచ్ కే ఇండ్ల నిర్మాణాన్ని 700 కోట్ల రూపాయిల‌తో పూర్తి చేశామని, 200 కోట్ల రూపాయిల‌తో ఆయా కాల‌నీకు మౌళిక వ‌స‌తులు క‌ల్పించామన్నారు. హౌసింగ్ బోర్డు ప‌రిధిలో లీజుకు తీసుకున్న, క‌బ్జా అయిన భూముల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంటుంద‌ని, ఇప్ప‌టికే వెయ్యి ఎక‌రాల భూమికి ప్ర‌హారీగోడ‌లు నిర్మించామన్నారు. గ‌త ప్ర‌భుత్వం గృహ నిర్మాణ శాఖ‌ను పూర్తిగా ర‌ద్దు చేసింద‌ని, పేద‌ల‌కు పక్కా ఇళ్ళు నిర్మించాల‌న్న ఆలోచ‌న‌తో తిరిగి గృహ నిర్మాణ శాఖ‌ను పున‌రుద్ద‌రించామని తెలిపారు. దీనికోసం 394 మంది డీఈఈల‌ను వెన‌క్కి ర‌ప్పించామ‌ని 800 మంది ఏఈల‌ను కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో తీసుకోవడం జరిగిందన్నారు. వివిధ శాఖ‌ల నుంచి 152 మందిని, రెవెన్యూ శాఖ నుంచి 32 మందిని డిప్యూటేష‌న్‌పై తీసుకున్నామని, పూర్తి స్ధాయిలో గృహ‌నిర్మాణ శాఖ‌ను రూపొందించి ప్ర‌ణాళికా బ‌ద్దంగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.

ఇందిర‌మ్మ ఇళ్ళ ప‌ధ‌కం అవినీతి ర‌హితంగా సాగాల‌ని భావించి ఎటువంటి ఫిర్యాదు వ‌చ్చినా 24 గంట‌ల్లోగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామని, లంచ‌మ‌డిగిన‌ 9 మంది పంచాయితీరాజ్ కార్య‌ద‌ర్శుల‌ను స‌స్పెండ్ చేశామన్నారు. మ‌రో ఇద్ద‌రిని స‌ర్వీసు నుంచి తొల‌గించ‌డం జ‌రిగిందన్నారు. గృహ జ్యోతి ప‌ధ‌కంతో పాటు గ‌తంలో ఇందిర‌మ్మ ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభించి మ‌ధ్య‌లోనే వ‌దిలేసిన సుమారు 15 వేల మందికి కొత్త ప‌ధ‌కం వ‌ర్తించేలా క్యాబినెట్ లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామన్నారు. మూడ‌వ విడ‌త ఇందిర‌మ్మ ఇళ్ళ మంజూరులో స్ధ‌లాలు లేని నిరుపేద‌ల‌కు ఇళ్ళు నిర్మించే అంశాన్ని క్యాబినెట్‌లో చ‌ర్చించి సానుకూల నిర్ణ‌యం తీసుకుంటామని చెప్పారు. పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివ‌సిస్తున్న ప్రాంతాల్లోనే జీ ప్ల‌స్ 4 ప‌ద్ద‌తిలో ఇందిర‌మ్మ ఇళ్ళు నిర్మించే విధంగా త్వ‌ర‌లో ఇందిర‌మ్మ అర్బ‌న్ హౌసింగ్ పాల‌సీని ప్ర‌క‌టించ‌బోతున్నామని తెలిపారు.

కేటీఆర్ ది విష‌పూరిత‌మైన ఆలోచ‌న‌

హిల్ట్ పాల‌సీపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై స్పందిచిన మంత్రి హిల్ట్ పాల‌సీలో రెండు అంశాలు బీఆర్ఎస్ పాల‌న‌లో వ‌చ్చిన‌వేనని అన్నారు. ఆ ఫైల్‌పై మంత్రిగా కేటీఆర్ సంత‌కం చేసిన సంగ‌తి మ‌రిచినట్లున్నారన్నారు. గ‌త ప్ర‌భుత్వంలో కోకాపేట‌, నియోపోలిస్ ప్లాట్లు వేలం వేశారని, హిల్ట్‌ను దోపిడీ పాల‌సీ అంటున్న కేటీఆర్‌కు ఇవి గుర్తులేవా? అని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ నిర్వ‌హ‌ణ‌ను కూడా వేలం వేశారని, అయ్య ముఖ్య‌మంత్రిగా కొడుకు ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా కావ‌ల‌సిన వారి ద‌గ్గ‌ర ముడుపులు తీసుకొని భూముల‌ను క‌న్వ‌ర్ష‌న్ చేశారని మండిపడ్డారు. ప్ర‌భుత్వ భూములు వేలం వేశారు, ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా వేలాది ఎక‌రాలు వేలం వేశారన్నారు. నాడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎల్‌బి న‌గ‌ర్‌లోని దాదాపు 40 ఎక‌రాల స్ధ‌లాన్ని పీవీ రాజు ఫార్మా కంపెనీకి లీజుకు ఇస్తే అక్క‌డ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీ తోటి భూగ‌ర్భ జ‌లాలు క‌లుషితం అవుతున్నాయ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు ఆందోళ‌న కూడా చేశారని, ఈ కెమిక‌ల్ ఇండ‌స్ట్రీని రెసిడెన్షియ‌ల్ జోన్‌గా మార్చింది బిఆర్ఎస్ కాదా? అని అడిగారు. ఈ ఫైలుపై అయ్య కొడుకులు సంత‌కాలు చేయ‌లేదా? ఏ పాల‌సీతో ఈ క‌న్వ‌ర్ష‌న్ చేశారన్నారు. ఐడీపీఎల్ లో కూడా ఇదే విధంగా చేశారని గుర్తు చేశారు. కేటీఆర్ క‌డుపునిండా విష‌మేఉందని, విషం క‌క్క‌డానికి కూడా ఒక హ‌ద్దు, అదుపు, ప‌ద్ద‌తి ఉంటుందన్నారు. హిల్ట్ పాల‌సీపై బీజేపీ, బీఆర్ఎస్‌ది ఒకే డ్రామా. స్క్రిప్ట్ రాసేది ఒక‌రు. డెలివ‌రీ చేసేది మ‌రొక‌రని మంత్రి మండిపడ్డారు.