- హామీల అమలు ఏమాయే
- ఇచ్చిన మాట తప్పి.. ఉత్సవాలు చేయడం సిగ్గుచేటు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలే
- దమ్ముంటే రేవంత్ రెడ్డి హామీల అమలుపై చర్చకు రావాలి
- ఇందిరా పార్క్ ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, మహా : ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఏదో ఘనకార్యం సాదించినట్లు రెండేళ్ళ పాలనపై రేవంత్ రెడ్డి ఉత్సవాలు జరపడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రెండేళ్ళ కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో రేవంత్ ప్రభుత్వంపై చార్జీషీట్ ను విడుదల చేసిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను బీఆర్ఎస్.. తన పదేండ్ల పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలపై కుటుంబ పాలన రుద్దిందని, బీఆర్ఎస్ పాలనలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. పదేళ్ళ పాటు ఒక నియంత పాలన ప్రజలపై రుద్దబడిందని, ఆ పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్లయిందన్నారు. మార్పుతో వస్తున్నామని, అనేక రకాల హామీలతో, అభయహస్తాలతో, గ్యారంటీలతో వస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటు వేశారన్నారు. నేడు రెండేళ్ళ పాలన విజయోత్సవ పాలన పేరుమీద రాష్ట్రంలో పర్యటిస్తున్న సీఎం ప్రజలకు ఏమిచ్చారో చెప్పకుండా మసిబూసి మారేడుకాయ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. నిజంగా ప్రజలకు మేలు చేశానని రేవంత్ రెడ్డి భావిస్తే ఇచ్చిన హామీలు ఎన్ని? మీరు అమలు చేసిన పథకాలెన్ని అనే అంశంపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. సీఎం ఎంత సేపు ఫ్రీబస్సు, సన్నబియ్యం అంటున్నారు తప్ప పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, మహిళలకు స్కూటీలు, మహిళలకు నెలకు రెండున్నర వేలు తదితర అంంశాలను ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు. ప్రతి కిలో సన్నబియ్యంకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ. 43 లు ఇస్తే రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వం కేవలం రూ.13 మాత్రమే ఇస్తుందన్నారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను.. మీ రెండేండ్ల పాలనలో ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పండని ప్రశ్నించారు. . ఏ రంగంలో మీరు చెప్పిన మార్పు వచ్చిందో తెలియదు కానీ ఒక్క మార్పు మాత్రం జరిగింది. కేసీఆర్ పోయి రేవంత్.. గులాబీ జెండా పోయి.. కాంగ్రెస్ జెండా వచ్చిందన్నారు. . పాలనలో మార్పు రాలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మార్పు రాలేదు. చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలేదన్నారు.
ఈ రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలు ఎలా పెరిగాయని, వైఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయిస్తే, కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. కనీసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయకుండా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా వెలగబెట్టిన చరిత్ర ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల చరిత్ర అని అన్నారు. మళ్లీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎందులో మార్పు వచ్చిందో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు, నిరుద్యోగులకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, ఉద్యోగులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యాయా? అని అడిగారు. ఏ విషయంలో మీరు ప్రజాపాలన చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులను పెట్టుకొని గ్రామాల్లో సభలు పెట్టుకొని తిరగడం కాదు.. ఇచ్చిన హామీల అమలు మీద చర్చకు సిద్ధమా? అని అడిగారు. పంటలపై బోనస్ ఇస్తానని మోసం, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు. 10 ఏళ్ళ పాలనలో ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ అమ్మకానికి పెట్టిందో.. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, భూములు అమ్మకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వలేని పరిస్థితి. బీరు, బ్రాంది అమ్మకపోతే.. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి. మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. మరి ఏమైంది రెండేండ్లు అయినా బెల్ట్ షాపులు ఎందుకు మూసివేయడం లేదు? బెల్టు షాపుల రద్దు మాట అటుంచితే, మద్యం అమ్మకాలతో లక్ష కోట్లకు పైగా ప్రజల నుంచి దోపిడీ చేయాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తేడా లేదు. ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలే. ఈ రెండు పార్టీలు అవినీతి, ఇచ్చిన హామీలు తుంగలో తొక్కే పార్టీలే, అక్రమాలకు పెద్దపీట వేసే పార్టీలే. అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇచ్చిన హామీల అమలు ఏమైందని కాంగ్రెస్ పాలకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలను కోరారు.







