- ఔను.. నా వివాహం రద్దయింది
- ఇన్ స్టా ఖాతాలో ప్రకటించిన స్మృతి మంధాన
- ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని రిక్వెస్ట్
- పలాశ్ ముచ్చల్ తో అర్ధాంతరంగా ఆగిన వివాహం
మహా : భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన పెళ్లి గురించి కీలక ప్రకటన చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో జరగాల్సిన తన పెళ్లి రద్దు అయినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె పెళ్లి రద్దు విషయం వెల్లడించింది. వారాల తరబడి నెలకొన్న ఊహాగానాలపై స్మృతి మంధాన క్లారిటీ ఇచ్చింది. పెళ్లి రద్దు అయినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా ఆమె అధికారికంగా ప్రకటించింది. ఈ సమయంలో రెండు కుటుంబాల గోప్యతను కాపాడాలని ఆమె సూచించింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ తో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న స్మృతి మంధాన ఇటీవల పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్దమైంది. ఈ నెల 23న వివాహానికి ముంబైలో ఏర్పాట్లు కూడా జరిగాయి. సంగీత్, మెహందీ వేడుకలు ఘనంగా జరగగా.. చివరి నిమిషంలో వివాహం ఆగిపోయింది.
స్మృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు ఆమె మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, శ్రీనివాస్ మంధాన కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత కూడా వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో స్మృతి, పలాశ్ ల వివాహం రద్దయినట్లేనని ప్రచారం జరిగింది. ఎంగేజ్‌మెంట్ ప్రపోజల్, హల్దీ, మోహందీ వేడుకలకు సంబంధించిన వీడియోలు స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల్లోంచి తొలగించడంతో ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. అయితే, ఈ వార్తలపై ఇటు స్మృతి కానీ అటు పలాశ్ కానీ స్పందించలేదు. పలాశ్ కుటుంబం మాత్రం వివాహం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది.
పలాశ్ ముచ్చల్ చీటింగ్ చేశారని ప్రచారం
పలాశ్ ముచ్చల్ ఓ కొరియోగ్రాఫర్ తో చేసిన చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వివరాలు బయటపడడంతోనే స్మృతి వివాహం రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తాజాగా స్మృతి మంధాన స్పందిస్తూ.. తన వివాహం రద్దు అయినట్లు అధికారికంగా ప్రకటించింది.
స్మృతి సందేశం ఇదే
‘నా వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి చూపించడానికి నేను ఇష్టపడను. అయితే, కొన్నిరోజులుగా నా జీవితంపై వదంతులు వస్తున్న క్రమంలో స్పందించాల్సి వస్తోంది. పలాశ్ తో నా వివాహం రద్దు అయింది. ఈ విషయాన్ని నేను ఇంతటితో వదిలేస్తున్నా. మీరూ వదిలేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని అందరూ గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక నా దృష్టంతా క్రికెట్ పైనే… జాతీయ జట్టుకు శక్తిమేర సేవలు అందిస్తాను’ అంటూ స్మృతి తన పోస్టులో వివరించింది.
స్పందించిన పలాశ్ ముచ్చల్
తానెవరినీ మోసం చేయలేదని స్పష్టీకరణ
స్మృతి మంధానతో తన వివాహం రద్దయిన నేపథ్యంలో సంగీత దర్శకుడు, ఫిల్మ్ మేకర్ పలాశ్ ముచ్చల్ స్పందించారు. ఈ వ్యక్తిగత సంబంధం నుంచి బయటికి వచ్చానని, ఇక తాను ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనపై వస్తున్న మోసం ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పలాశ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై ఇటీవల వస్తున్న మోసం ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవి అవాస్తవాలని కొట్టిపారేశారు. “నాపై వస్తున్న వదంతులను నిజమని నమ్మేవారిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. కేవలం ఊహాగానాల ఆధారంగా ఒకరిపై నిర్ణయానికి రావడం సరికాదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో, తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారికి పలాశ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. “నా గురించి, నా కుటుంబం గురించి నిరాధారమైన అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను” అని ఆయన స్పష్టం చేశారు. స్మృతి మంధాన తమ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన వెంటనే పలాశ్ ఈ వివరణ ఇవ్వడం గమనార్హం.







