ఇండిగో ఇక్కట్లు.
* ఆదివారం మరో 650 విమానాలు రద్దు.
* ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు!
* రీఫండ్ ఇవ్వాల్సిందే.. డీజీసీఏ డెడ్‌లైన్.
* డిసెంబర్ 10 వరకు ఇంతేనా?
* టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వడమే మా తొలి ప్రాధాన్యత.
* ఇండిగో కీలక ప్రకటన.
న్యూ ఢిల్లీ, మహా.
దేశీయ విమానయాన రంగంలో దిగ్గజ సంస్థగా పేరొందిన ఇండిగోకు సాంకేతిక, నిర్వహణాపరమైన సమస్యలు పెను సవాలుగా మారాయి. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న విమానాల రద్దు పర్వం ఆదివారం నాడు తారాస్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా దాదాపు 650 విమానాలను రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించడంతో, వారాంతంలో ప్రయాణాలు పెట్టుకున్న వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధానంగా ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై వంటి మెట్రో నగరాల విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఆదివారాల్లో ఇండిగో సంస్థ సగటున 2,300 విమాన సర్వీసులను నడుపుతుండగా, ప్రస్తుత సంక్షోభం కారణంగా ఈ ఆదివారం కేవలం 1,650 సర్వీసులను మాత్రమే నడపగలిగింది. అయితే, డిసెంబర్ 10వ తేదీ నాటికి పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తాయని, సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
మరోవైపు, రద్దయిన విమానాల ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వడంపై డీజీసీఏ సీరియస్‌గా స్పందించింది. ఆదివారం రాత్రి 8 గంటల లోపు ప్రయాణికులకు రీఫండ్‌లను జారీ చేయాలని శనివారమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి స్పందించిన ఇండిగో యాజమాన్యం, ప్రయాణికులకు రీఫండ్ ఇవ్వడమే తమ మొదటి ప్రాధాన్యత అని వెల్లడించింది. ఈ క్లిష్ట సమయాన్ని ఎదుర్కోవడానికి మరియు సమస్యను త్వరితగతిన పరిష్కరించడానికి సంస్థ సీఈఓ మరియు బోర్డు సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక ‘క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూపు’ను ఏర్పాటు చేసింది. విమాన సర్వీసుల పునరుద్ధరణ, ప్రయాణికుల సమస్యల పరిష్కారంపై ఈ బృందం నిరంతరం పర్యవేక్షించనుంది.
విమానాల రద్దుతో సతమతమవుతున్న ప్రయాణికులను ఆదుకునేందుకు భారతీయ రైల్వే శాఖ గొప్ప మనసుతో ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ, తాజాగా నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే పరిధిలో మరిన్ని అదనపు సర్వీసులను ప్రకటించింది. ఇందులో భాగంగా దిబ్రూగఢ్-న్యూఢిల్లీ , గువాహటి-హౌరా మధ్య సోమవారం నుండి ప్రత్యేక రైళ్లు పట్టాలపైకి రానున్నాయి. అంతేకాకుండా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికే నడుస్తున్న 18 రైళ్లకు అదనంగా 20 కోచ్‌లను జత చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. విమానయాన రంగం సంక్షోభంలో ఉన్న వేళ, రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు కొంతమేర ఊరటనిస్తోంది.







