Mahaa Daily Exclusive

  వందేమాతరం@150 ఇయర్స్

Share

  • వందేమాతరం@150 ఇయర్స్
  • నేడు 10 గంటల పాటు పార్లమెంట్​లో ప్రత్యేక చర్చ
  • ప్రారంభించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ, మహా : భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక భాగంగా మారిన వందేమాతరం గీతం 150 వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని లోక్ సభ, రాజ్యసభలలో సోమవారం ప్రత్యేక చర్చ జరగనుంది. దేశ ప్రజల్లో దేశభక్తిని రగిల్చే మహత్తర అస్త్రంగా అవతరించింది వందేమాతర గీతం. ఈ చర్చను మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. లోక్ సభలో నరేంద్ర మోడీ సుదీర్ఘ ప్రసంగం చేయనున్నారు. వందేమాతరంపై లోక్‌సభలో చర్చ కోసం మొత్తం 10 గంటల సమయాన్ని కేటాయించారు. ఇందులో 3 గంటల సమయాన్ని అధికార ఎన్‌డీఏ కూటమికి కేటాయించారు. ప్రత్యేక చర్చ సందర్భంగా వందేమాతరంతో ముడిపడిన కీలకమైన చారిత్రక విశేషాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. వందేమాతరం 150 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆ జాతీయ గేయం స్మారకోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబరు 7న దిల్లీలో ప్రారంభించిన విషయం తెలిసిందే. బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతర గేయం తొలిసారిగా 1875 సంవత్సరం నవంబరు 7న ‘బంగ దర్శన్’ అనే సాహిత్య పత్రికలో ప్రచురితమైంది. అనంతరం ఆ గేయాన్ని తన నవల ‘ఆనంద్ మఠ్’లో బంకిమ్ చంద్ర ఛటర్జీ చేర్చారు. ఈ నవల 1882లో ప్రచురితమైంది. వందేమాతరం గేయాన్ని సంగీతపరంగా స్వరపర్చిన వ్యక్తి జాదూనాథ్ భట్టాచార్య. 1896లో కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం వేదికగా తొలిసారిగా వందేమాతర గేయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. దీంతో ఆ గేయానికి ప్రజల్లో క్రేజ్ పెరిగింది. తదుపరి భారత స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం కీలక భాగంగా మారింది. దేశ ప్రజల్లో దేశభక్తిని రగిల్చే మహత్తర అస్త్రంగా అవతరించింది.