- వికసిత్ భారత్ దిశగా తెలంగాణ
- 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
- మహిళాభ్యున్నతి ప్రాధాన్యమిస్తున్నాం
- గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించిన గవర్నర్ జిష్టు దేవ్ వర్మ
హైదరాబాద్, మహా : నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు. సోమవారం ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన గవర్నర్ మాట్లాడుతూ, వికసిత్ భారత్ దిశగా తెలంగాణ రైజింగ్ కొనసాగుతోందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ పటిష్టవంతమైన పాత్ర పోషించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా రైతులను పలు విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. బస్సుల నిర్వహణ కూడా మహిళా సంఘాలకు ఇచ్చామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో స్థిరమైన, పారదర్శకమైన ప్రభుత్వం ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వివరించారు. ఈ సదస్సులో పాల్గొంటున్న విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, మీడియా ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ సదస్సు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. 2047 నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఉందన్నారు.






