స్కూళ్లకు 2 రోజులు సెలవులు.
* విద్యాశాఖ కీలక ప్రకటన.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కిన తరుణంలో విద్యాశాఖ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ దృష్ట్యా పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు (డీఈవోలు) ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు ఈ నెల 10, 11 తేదీల్లో సెలవులు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ నెల 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. అందుకే డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం, ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేయడం వంటి పనుల దృష్ట్యా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే 11వ తేదీన పోలింగ్ ఉండటంతో ఆ రోజు కూడా పాఠశాలలు మూసివేయనున్నారు. ఈ రెండు రోజుల పాటు తరగతులు జరగవని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో దాదాపు 4,236 గ్రామాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పోలింగ్ బూత్ ఏర్పాట్లు చేస్తుండటం, ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటుండటంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే ఈ సెలవులను ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత పాఠశాలలు యధావిధిగా తెరుచుకోనున్నాయి.






