Mahaa Daily Exclusive

  పేగు బంధంపై ముళ్ల దాడి…..

Share

పేగు బంధంపై ముళ్ల దాడి.
* కన్న తండ్రినే కాటికి పంపే ప్రయత్నం!
* రాతి గుండె.. రాక్షస కొడుకు
* బతికుండగానే తండ్రిని స్మశానానికి పంపిన వైనం
* జడ్చర్ల ఆసుపత్రి పొదల్లో వృద్ధుడి మరణయాతన.

హైదరాబాద్, మహా.

కలికాలం కసాయి కోరల్లో చిక్కుకుంది. మానవత్వం మసకబారిపోతోంది. తొమ్మిది నెలలు మోసి, కని, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి రాగానే వారిని భారంగా భావిస్తున్న ప్రబుద్ధులు సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్నారు. రక్త సంబంధం కంటే ఆస్తి బంధమే గొప్పదని, కన్న ప్రేమ కంటే స్వార్థమే మిన్నదని నిరూపించే హృదయ విదారక ఘటనలు కోకొల్లలు. తాజాగా జడ్చర్ల మున్సిపాలిటీ నడిబొడ్డున మంగళవారం చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన, రాతి గుండెలను సైతం కరిగించేలా ఉంది. ఒక కర్కశ కుమారుడు కన్నతండ్రిని చెత్తను పారేసినట్లు ముళ్ళ పొదల్లో విసిరేసి వెళ్ళిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఒంటికి బట్ట, కడుపుకి తిండి లేకపోయినా బిడ్డను మహారాజులా చూసుకున్న ఆ తండ్రికి, చివరకు ఆ కొడుకే యమభటుడిలా మారాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయిలకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వడ్డే బాలయ్య అనే వృద్ధుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచం పట్టి అచేతన స్థితిలో ఉన్నాడు. తండ్రికి సేవలు చేయడం భారంగా భావించిన అతడి కుమారుడు, మానవత్వాన్ని మర్చిపోయి మృగంలా ప్రవర్తించాడు. మంగళవారం బైక్ పై తండ్రిని జడ్చర్లకు తీసుకువచ్చిన అతడు, తన పాపం ఎవరికీ తెలియకూడదన్నట్లుగా ముఖానికి గుడ్డలు కట్టుకుని ముసుగు వేసుకున్నాడు. జడ్చర్ల మున్సిపాలిటీలోని 100 పడకల ఆసుపత్రి సమీపంలో జనసంచారం లేని దట్టమైన కంప పొదలను చూసుకుని, బతికున్న తండ్రిని ఆ గుంతలోకి నిర్దాక్షిణ్యంగా నెట్టేసి పరారయ్యాడు.
అచేతన స్థితిలో, కనీసం కదలలేని నిస్సహాయతలో ఆ వృద్ధుడు ఆ ముళ్ళ కంపల్లోనే నరకయాతన అనుభవించాడు. దాహం.. దాహం.. అంటూ మూలుగుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు. అదృష్టవశాత్తు అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు ఆ ఆర్తనాదాలు వినిపించి వెళ్లి చూడగా, కంప పొదల్లో దిక్కులేని స్థితిలో పడి ఉన్న వృద్ధుడు కనిపించాడు. ఆ దృశ్యం చూసి చలించిపోయిన స్థానికులు వెంటనే స్పందించి, అతడిని ఆ ముళ్ళ నుంచి బయటకు తీశారు. వృద్ధుడు మాట్లాడలేని స్థితిలో ఉండడంతో వివరాలు పూర్తిగా తెలియలేదు. వెంటనే మానవతా దృక్పథంతో అతడిని జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి, బాధితుడు రాంపూర్ గ్రామానికి చెందిన వడ్డే బాలయ్యగా గుర్తించారు. కన్నతండ్రిని ఇలా అనాధలా పడేసి వెళ్లిన ఆ కిరాతక కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పదింతలు సంపాదించినా, పాటి మన్ను కూడా వెంటరాదని తెలిసినా, పేగు బంధాలను తెంచుకుంటున్న ఇలాంటి ఘటనలు చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యే బతుకుతున్నామా అనే సందేహం కలుగుతోందని స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు.

Latest