Mahaa Daily Exclusive

  సొంతిల్లు సామాన్యుడి హక్కు.

Share

సొంతిల్లు సామాన్యుడి హక్కు.
* తెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచి.
* ఓఆర్ఆర్ – ఆర్ఆర్ఆర్ మధ్యలో నవ నగరాలు.
* ఇందిరమ్మ ఇళ్లతో పాటు అఫర్డబుల్ హౌసింగ్‌పై సర్కార్ స్పెషల్ ఫోకస్.
* గ్లోబల్ సమ్మిట్ వేదికగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా, ఉన్నత ప్రమాణాలతో కూడిన సొంత ఇంటిని సమకూర్చడమే ప్రజా ప్రభుత్వం సంకల్పమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో అట్టహాసంగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా మంగళవారం నిర్వహించిన ‘అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్బన్ ఫ్యూచర్ – తెలంగాణ మోడల్ 2047’ సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో రూపొందిస్తున్న ఈ నూతన గృహ నిర్మాణ విధానం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక రోల్ మోడల్‌గా నిలిచిపోతుందని మంత్రి ఉద్ఘాటించారు. కేవలం పథకాలకే పరిమితం కాకుండా, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఆర్థిక వెసులుబాటు, పర్యావరణ హితం, అత్యాధునిక సాంకేతికత కలబోసి ఈ సమగ్ర పాలసీని తయారు చేస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలో ఇళ్ల డిమాండ్ , సరఫరా మధ్య ఉన్న భారీ అంతరాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న విశాలమైన ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ తరహాలో భారీ శాటిలైట్ టౌన్‌షిప్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి పొంగులేటి సంచలన విషయాన్ని వెల్లడించారు. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. గతంలో ఇందిరమ్మ పథకం ద్వారా 42 లక్షల ఇళ్లు నిర్మించిన ఘనత కాంగ్రెస్‌దేనని, ఇప్పుడు అదే స్ఫూర్తితో మరో 3.5 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణను మూడు ప్రధాన జోన్లుగా విభజించి అభివృద్ధి వికేంద్రీకరణకు బాటలు వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కోర్ అర్బన్ ప్రాంతాల్లో మురికివాడల పునరాభివృద్ధి, ఐటీ కారిడార్లలో ఉద్యోగులకు అందుబాటు ధరల్లో అద్దె గృహాలు, పెరి-అర్బన్ ప్రాంతాల్లో ప్లాన్డ్ టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులకు నివాస సముదాయాల కల్పన వంటి వ్యూహాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని వివరించారు. ఈ సదస్సులో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, హడ్కో, క్రెడాయ్, రాంకీ సంస్థల అధిపతులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.

Latest