- పీసీసీ చీఫ్ గా సంతృప్తిగా ఉన్నా
- త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు భర్తీ
- నెలాఖరులోపు కార్పొరేషన్ ఛైర్మన్లు, బోర్డు పదవులు భర్తీ చేస్తాం
- గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ చూడలేక హరీష్ విమర్శలు
- మీడియాతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్
హైదరాబాద్, మహా : త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్‌లు భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. టీపీసీసీ నియామకం జరిగిన రోజే డీసీసీలు మినహా ఇతర అన్ని పోస్టులు రద్దు అవుతాయని తెలిపారు. ఈనెల చివరి నాటికి కార్పొరేషన్ చైర్మన్‌లు, డైరెక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. లంబాడాలను నాలుగు జిల్లాలకు అధ్యక్షులను నియమించామని తెలిపారు. ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. బుధవారం గాంధీభవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ చూడలేక మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఊహించని స్థాయిలో తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయని చెప్పుకొచ్చారు. పేరుగాంచిన కంపెనీలతోనే తమ ప్రభుత్వానికి ఒప్పందాలు జరిగాయని వివరించారు. ముందు కొన్ని కార్యక్రమాలు ఫిక్స్ కావడంతో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే ,రాహుల్ గాంధీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రాలేకపోయారని తెలిపారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము తమకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. శ్వేతపత్రం అంటే బీఆర్ఎస్‌కు భయమని మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీ భవిష్యత్‌లో గొప్పగా ఉంటుందని తెలిపారు. లావాదేవీలలో భాగంగానే కవిత – బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కవిత కారణంగా బీఆర్ఎస్ కబ్జాలు అన్ని బయటకు వస్తున్నాయని విమర్శించారు. కవిత ఆరోపణలపై విచారణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
డిప్యూటీ సీఎం, మంత్రి పదవులు ఊహాగానాలు
తాను టీపీసీసీగా చాలా సంతృప్తిగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆర్గనైజేషన్ అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. మీడియాలోనే తనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారని చెబుతున్నారని.. అప్పుడే మంత్రి పదవి ఇస్తున్నారంటూ కూడా ఊహాగానాలు వస్తున్నాయని తెలిపారు. లోక్‌సభలో ప్రియాంక గాంధీ చాలా బాగా మాట్లాడారని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
గ్రామాల్లో ఏకగ్రీవం సాధారణ విషయం కాదు
గ్రామ సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక సాధారణ విషయం కాదని స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టారని మహేష్ గౌడ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. వందేమాతరం విషయంలో రాజకీయ లబ్ధి కోసం ప్రధాని చవకబారు మాటలు మాట్లాడుతున్నారని ప్రియాంక గాంధీ చరిత్రను మరోసారి గుర్తు చేశారన్నారు. వందేమాతరం ఆచరించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఈవీఎంలు కాంగ్రెస్ హయంలో ప్రవేశ పెట్టినప్పటికీ ట్యాంపరింగ్ మాత్రం బీజేపీ హయాంలో ఓట్ చోరీ 100 శాతం జరుగుతుందని ఆరోపించారు. నెహ్రూ విజన్ వల్లే నేడు దేశం ఈ స్థితిలో ఉందని చెప్పారు.






