Mahaa Daily Exclusive

  ఉచ్చు బిగిసింది.. లొంగుబాటు తప్పదు!

Share

ఉచ్చు బిగిసింది.. లొంగుబాటు తప్పదు!
* పిన్నెల్లి బ్రదర్స్‌కు మూసుకుపోయిన దారులు.
* నేడు మాచర్ల కోర్టు మెట్లెక్కనున్న మాజీ ఎమ్మెల్యే.
* సుప్రీం డెడ్‌లైన్ ముగియడంతో కీలక నిర్ణయం.
* గుండ్లపాడు జంట హత్యల కేసులో ఉత్కంఠకు తెర.

హైదరాబాద్, మహా.

చట్టం నుంచి తప్పించుకోవడానికి అన్ని దారులు మూసుకుపోవడంతో వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు తలవంచక తప్పలేదు. పల్నాడు గడ్డపై సంచలనం సృష్టించిన గుండ్లపాడు జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6), ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి (ఏ7) లొంగుబాటుకు సిద్ధమయ్యారు. గురువారం మాచర్ల కోర్టులో వీరు లొంగిపోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2025 మే 24న వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల దారుణ హత్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా చూడాలంటూ పిన్నెల్లి సోదరులు చేసిన న్యాయ పోరాటం సుప్రీంకోర్టు తీర్పుతో విఫలమైంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు సుప్రీంకోర్టు ఆదేశాలతో తెరపడింది.
సుప్రీం సీరియస్.. సాక్ష్యాల తారుమారుపై ఆగ్రహం
కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వినిపించిన వాదనలు పిన్నెల్లి సోదరులకు ఉచ్చు బిగించేలా చేశాయి. నిందితులు పోలీసులకు సహకరించడం లేదని, బయట ఉంటే సాక్షులను బెదిరించి, ఆధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని లూథ్రా బలంగా వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేయడమే కాకుండా, అరెస్టుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. బెయిల్ రద్దు తర్వాత, లొంగిపోయేందుకు పిన్నెల్లి తరఫు న్యాయవాదులు కోరగా సుప్రీంకోర్టు రెండు వారాల సమయం ఇచ్చింది. ఆ గడువు గురువారంతో ముగియనుంది. దీంతో ఇక అరెస్టు తప్పదని గ్రహించిన పిన్నెల్లి సోదరులు, గౌరవప్రదంగా కోర్టులో లొంగిపోవడమే మేలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గురువారం మాచర్ల కోర్టులో హాజరై, అక్కడి నుంచి న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కోనున్నారు. ఈ పరిణామంతో పల్నాడు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది.

Latest