పీఎంవో వేదికగా ‘పొలిటికల్ వార్’…
* మోదీ ముఖం మీదే ‘నో’ చెప్పిన రాహుల్!
* 88 నిమిషాల హైడ్రామా…
* షా, మోదీల వ్యూహాలకు రాహుల్ గాంధీ ‘అసమ్మతి’ చెక్.
* ఆ నియామకాలు చెల్లవు… ప్రధాని కార్యాలయంలో రాహుల్ గాంధీ సంచలనం.
న్యూ ఢిల్లీ, మహా.
దేశ రాజధాని ఢిల్లీలోని సౌత్ బ్లాక్ బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారం, ప్రతిపక్షం ఒకే గదిలో కూర్చున్నా… అక్కడ జరిగింది మాత్రం సయోధ్య కాదు, సిద్ధాంతాల సంగ్రామం! ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ… ఈ ముగ్గురు అగ్రనేతలు దాదాపు గంటన్నర పాటు జరిపిన భేటీ ఢిల్లీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రాహుల్ గాంధీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడమే కాకుండా, పీఎంవో వేదికగా తన నిరసన గళాన్ని బలంగా వినిపించడం ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది*
సాధారణంగా ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు మొక్కుబడి తంతులా సాగిపోతుంటాయి, కానీ బుధవారం ప్రధాని కార్యాలయంలో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. కేంద్ర సమాచార కమిషన్ ,కేంద్ర విజిలెన్స్ కమిషన్ వంటి అత్యంత కీలకమైన రాజ్యాంగబద్ధ సంస్థల అధిపతులను ఎంపిక చేసేందుకు ప్రధాని మోదీ సారథ్యంలోని హైపవర్ కమిటీ సమావేశమైంది. మధ్యాహ్నం 1 గంటకు రాహుల్ గాంధీ పీఎంవోకు చేరుకోగా, సరిగ్గా 1:07 నిమిషాలకు ప్రారంభమైన ఈ సమావేశం అనూహ్యంగా 88 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగింది. బయట ఉన్న వారికి లోపల ఏం జరుగుతుందో తెలియకపోయినా, గదిలో మాత్రం తీవ్రస్థాయిలో చర్చలు జరిగినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రతిపాదించిన పేర్ల జాబితాను చూసిన వెంటనే రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం ముందుంచిన షార్ట్‌లిస్ట్‌లోని పేర్లు పారదర్శకతకు ఏమాత్రం న్యాయం చేసేలా లేవని రాహుల్ గాంధీ వాదించారు. కేవలం మౌఖికంగా అభ్యంతరం చెప్పి ఊరుకోకుండా, ఆయన తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. మోదీ సర్కార్ ఎంపిక చేసిన పేర్లతో తాను విభేదిస్తున్నానని స్పష్టం చేస్తూ, అక్కడికక్కడే లిఖితపూర్వకంగా “డిసెంట్ నోట్” (అసమ్మతి పత్రం)ను కమిటీకి సమర్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన సీఐసీ, సీవీసీ వంటి పదవుల్లో ప్రభుత్వానికి అనుకూలమైన వారిని కూర్చోబెట్టే ప్రయత్నాలను తాను సహించేది లేదని ఆయన తన చర్య ద్వారా చెప్పకనే చెప్పారు. దీంతో ఏకాభిప్రాయంతో జరగాల్సిన ఎంపిక ప్రక్రియ, ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య మరో యుద్ధానికి తెరలేపింది.
మరోవైపు దేశంలో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హీరాలాల్ సామరియా పదవీ విరమణ చేసి మూడు నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ ఆ కుర్చీ ఖాళీగానే దర్శనమిస్తోంది. ఆయనతో పాటు మరో ఎనిమిది కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో, న్యాయం కోసం దాఖలైన 30 వేల 838 కేసులు పెండింగ్‌లో మగ్గుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియపై విపక్ష నేత రాహుల్ గాంధీ అసమ్మతి వ్యక్తం చేయడం, ఈ మొత్తం వ్యవహారాన్ని కొత్త మలుపు తిప్పింది. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుందా? లేక విపక్ష నేత అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటుందా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది






