ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం ప్రత్యేక స్కూల్.
* ప్రజా రవాణా వాటా 70 శాతానికి పెంచడమే లక్ష్యం.
* హైదరాబాద్‌లో 373 కొత్త రూట్లలో బస్సులు ప్రారంభం.
* మహాలక్ష్మి పథకం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, విజన్-2047లో భాగంగా ప్రస్తుతం ఉన్న 28 శాతం ఆర్టీసీ రవాణా వాటాను 70 శాతానికి పెంచడమే తమ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం బస్ భవన్ నుంచి డిపోల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ కొత్త రూట్లను అన్వేషించాలని, ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో తాజాగా 373 కొత్త రూట్లను గుర్తించి బస్సులు నడిపిస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల రింగ్ రోడ్డు ఆవల ఉన్న సుమారు 7 లక్షల మందికి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. సంస్థ పరిరక్షణతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉద్ఘాటించారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు అధునాతన సౌకర్యాలతో ప్రత్యేకంగా ‘ఆర్టీసీ స్కూల్’ ఏర్పాటు చేసే విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్టాండ్ల ఆవరణలో ప్రయాణికులను తరలిస్తున్న ప్రైవేట్ వాహనాలపై రవాణా శాఖ అధికారులు ఉక్కుపాదం మోపాలని, అవసరమైతే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు.
గత పదేళ్లుగా సంక్షోభంలో ఉన్న ఆర్టీసీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో లాభాల బాట పట్టించామని, ప్రస్తుతం 90కి పైగా డిపోలు లాభాల్లో నడుస్తున్నాయని మంత్రి వివరించారు. రెండేళ్ల కాలంలో 2476 కొత్త బస్సులు కొనుగోలు చేశామని, కారుణ్య నియామకాల కింద 1190 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 3038 డ్రైవర్, కండక్టర్, సూపర్ వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. పర్యావరణ హితం కోసం వచ్చే రెండేళ్లలో 2800 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






