ప్రతి నియోజకవర్గానికి మినీ స్టేడియం.
* హైదరాబాద్‌లో 1000 ఎకరాల్లో ‘స్పోర్ట్స్ సిటీ’
* లక్ష్యం 2036 ఒలింపిక్స్.. సర్కార్ నయా ప్లాన్.
* క్రీడా శాఖ మంత్రి వకిటి శ్రీహరి.
హైదరాబాద్, మహా.
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు ప్రకటించింది. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో మినీ స్టేడియంలు నిర్మిస్తున్నట్లు క్రీడా శాఖ మంత్రి వకిటి శ్రీహరి తెలిపారు. అంతేకాకుండా, ఒలింపిక్ స్థాయి పోటీల కోసం హైదరాబాద్ శివార్లలో ఏకంగా 1000 ఎకరాల విస్తీర్ణంలో ‘శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు లఫ్ బరో, కొరియా వంటి విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని మంత్రి చెప్పారు. పీవీ సింధు, జ్వాల గుత్తా, గోపీచంద్ వంటి క్రీడా దిగ్గజాల సూచనల మేరకు కోచ్‌ల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. కోచ్‌లకు అండగా నిలిచేందుకు ‘గురు వందన’ పథకం, బీమా సౌకర్యాలు కల్పిస్తున్నామని, గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారులను తయారు చేసేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని బలోపేతం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.






