- ఎందుకు… ఏమైంది మీకు
- తెలంగాణ ఎంపీలకు ప్రధాని మోడీ క్లాస్
- రేవంత్ వైఫల్యాలపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీత
- మీ కంటే అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉందన్న ప్రధాని
- పనితీరు మార్చుకోండి… ప్రజల్లోకి బలంగా వెళ్ళండి
- ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైఫల్యం ఎందుకని ప్రశ్న
- ఎనిమిది ఉన్నా ఆశించిన ఫలితం లేదని పెదవి విరుపు
- బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో తలంటిన వైనం
న్యూఢిల్లీ, మహా : రాష్ట్ర బీజేపీ పనితీరుపై గత కొంత కాలంగా కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ఎంపీల ముందుంచారు. అధికార పార్టీ పనితీరుపై పార్టీ ఎంపీలు అనుసరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ తో సమానంగా రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. ఎన్డీే భాగస్వామ్య పార్టీల ఎంపీలతో నిత్యం బ్రేక్ ఫాస్ట్ సమావేశాలను నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలను తెలుసుకుంటూనే ఆయా రాష్ట్రాలలో ఏన్డీఏ కూటమి పార్టీల పనితీరుపై తనకున్న అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా గురువారం మోడీ ఏపీ, తెలంగాణ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ ఎంపీల పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేసిన మోడీ తెలంగాణ ఎంపీల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వాస్తవానికి 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనుకున్నానని, అయితే అనుకోని కారణాలతో ఓడిపోయినా ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తారని భావించానని మోడీ ఎంపీలతో అన్నారు. అక్కడ కూడా మీరు విఫలమయ్యారని మోడీ పెదవి విరిచారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు మీకున్న అడ్డంకులు ఏమిటి, ఇబ్బందులు ఏమిటని ఎంపీలను మోడీ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో వైఫల్యం చెందింది. ఆ విషయాన్ని ప్రజల్లోకి బలంగా ఎందుకు తీసుకు వెళ్ళలేకపోతున్నారని ప్రధాని ఎంపీలను అడిగారు. మీలో మీకు విబేధాలుంటే చెప్పండి, పరిష్కరించుకోండి, ఆ విబేధాలను పార్టీపై ప్రభావం పడేలా చేస్తామంటే ఎలా అని అడిగారు. తెలంగాణలో పార్టీ బలపడుతుందని ఎంతో సంతోషపడ్డాం, తెలంగాణపై ఎన్నో ఆశలున్నాయని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు అవకాశమున్నా కనీసం ప్రతిపక్ష పాత్రకూడా పోషించటంలేదని మండిపడ్డారు.
మంచి టీమును పెట్టుకుని కూడా పార్టీ సమర్ధవంతంగా ఎందుకు అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవటానికి ఇబ్బందులు పడుతోందని నిలదీశారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరగటానికి మంచి అవకాశంఉన్నా ఉపయోగించుకోవటంలో విఫలమైతుతున్నారని మండిపడ్డారు. జాతీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చతికిల పడిన తరుణంలో బీజేపీ ప్రజల్లోకి బలంగా వెళ్ళక పోతే భవిష్యత్ ఇబ్బందికరంగా ఉంటుందని చురకలు వేశారు. ఇప్పటికైనా ఎంపీలు తమ నిర్లక్ష్యాన్ని వీడాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పొల్గొనడంతో పాటు ప్రజల్లోకి చురుగ్గా వెళ్ళాలని ప్రధాని సూచించారు. ఇక నుంచి మీ ప్రతి అడుగు ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ కనిపించాలని, క్రియాశీల కార్యకర్తలను నిర్వీర్యం చేసే చేష్టలకు స్వస్తి పలకాలని ప్రధాని ఎంపీలకు హితవు చెప్పారు. తొలి నుంచి తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు, ఆ ఆధరణను మనం స్వంతం చేసుకోవడంలో విఫలమైతే మనల్ని ప్రజలు క్షమించరని ప్రధాని అన్నట్లు సమాచారం.






