- ఎమ్మెల్యే ఆత్మాహుతి బెదిరింపు
- భూములు కబ్జా చేసినట్లు నిరూపిస్తే జైలుకు వెళ్ళేందుకు సిద్దమన్న మాధవరం కృష్ణారావు
హైదరాబాద్, మహా : కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తాను ఆత్మాహుతి చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డారు. భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ తనపై వస్తున్న ఆరోపణలపై కృష్ణారావు ఘాటు స్పందించారు. తాను కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. తనపై చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలేనని కొట్టిపారేశారు. తాను ప్రజల కోసమే పనిచేశానని, తానంటే ఏంటో ప్రజలకు బాగా తెలుసని అన్నారాయన. కబ్జాల ఆరోపణలపై గురువారం ఆయన స్పందిస్తూ ఇద్దరు నేతలు కావాలనే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐడీపీఎల్ భూముల్లో పేదలు నివాసం ఉంటున్నారని, వారి జోలికి వెళ్తే తాను ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
రూ.4వేల కోట్ల విలువైన భూముల ఆక్రమణ వివాదంపై లోతుగా దర్యాప్తు జరగాల్ని ఆయన కోరారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలకు పాల్పడుతున్నారని, ఈ అంశంపై తాను గతంలోనే చాలా సార్లు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆ భూముల్లో డ్రైనేజీ, రోడ్ల నిర్మాణాల కోసం నిధులు తీసుకొచ్చానని కూడా చెప్పారు. అంతేకాకుండా తాను ఐడీపీఎల్ ఉద్యోగులను బెదిరించానని వస్తున్న వార్తల్లో కూడా ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఆ వార్తలను తాను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పారు.






