- తెలంగాణను వణికిస్తున్న చలి
- మరో 2 రోజులు తీవ్రమైన శీతల గాలులు
- ఎల్లో హెచ్చరికలు జారీ
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రోజంతా కూడా అదే పరిస్థితి ఉంటుంది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం 5 దాటితే పరిస్థితి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలి తీవ్రతకు పల్లెలు వణికిపోతున్నాయి. పట్నం, పల్లె అనే తేడా లేకుండా చలి పంజా విసురుతోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం పొగమంచు పరిస్థితులు ఉంటే సాయంత్రం 5 దాటితే ఇంట్లో నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు.
జిల్లాలకు హెచ్చరికలు జారీ
హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణలోని పలుచోట్ల అక్కడక్కడ కనిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట,సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
13 వ తేదీ (శనివారం) న ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వచే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 14వ తేదీ (ఆదివారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
హైదరాబాద్ వెదర్ రిపోర్ట్
ఇక హైదరాబాద్ లో రాత్రి సమయంలో పొగమంచుతో కూడిన పరిస్థితులుంటాయి. రాబోయే 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా ఉంటాయి. ఉపరితల గాలులు ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.






