Mahaa Daily Exclusive

  చింతూరు బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి…మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన…..

Share

న్యూఢిల్లీ, మహా.
ఆల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మన్యం ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుండి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేటు బస్సు తులసిపాకలు ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలో పడిన ఘటన, అందులో పలువురు మృతి చెందడం తనను ఎంతగానో కలచివేసిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే అధికారులతో మాట్లాడిన ప్రధాని మోడీ, ఘటనా స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. యాత్ర కోసం వెళ్తూ భక్తులు ఇలా మృత్యువాత పడటం దురదృష్టకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.

Latest