Mahaa Daily Exclusive

  బుక్ మై షోకి హైకోర్టు ‘అఖండ’ షాక్..

Share

బుక్ మై షోకి హైకోర్టు ‘అఖండ’ షాక్..
* కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా?.. టికెట్ల అమ్మకాలపై చివాట్లు.
* జీవో రద్దయినా పాత రేట్లేనా?.. బుక్ మై షో తీరుపై న్యాయమూర్తి సీరియస్
* బుకింగ్స్ ఎలా ఓపెన్ చేశారు?..
* ‘అఖండ-2’ విచారణలో కోర్టు ప్రశ్నల వర్షం
హైదరాబాద్, మహా.

అగ్ర హీరో బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రం గురువారం రాత్రి ప్రీమియర్లతో అట్టహాసంగా విడుదలైంది. అయితే సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన రేట్ల పెంపు జీవోను సవాల్ చేస్తూ అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి, ప్రీమియర్ షోల విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో’ వ్యవహరించిన తీరుపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
విచారణ సమయంలో ప్రభుత్వం తరఫున హాజరైన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కీలక విషయాలను కోర్టుకు నివేదించారు. టికెట్ల రేట్ల పెంపుపై గతంలో హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు, ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేశామని స్పష్టం చేశారు. అంతేకాకుండా, జీవో రద్దుకు సంబంధించిన సమాచారాన్ని, కోర్టు ఉత్తర్వుల కాపీని వెంటనే ‘బుక్ మై షో’ సంస్థకు అందజేశామని తెలిపారు. ప్రభుత్వం ఇంత స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఆన్‌లైన్ పోర్టల్‌లో మాత్రం పాత జీవో ప్రకారం పెంచిన రేట్లకే టికెట్లు ఎలా అమ్ముడయ్యాయని న్యాయమూర్తి ప్రశ్నించారు.
దీనిపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించిన బుక్ మై షో నిర్వాహకులు.. అప్పటికే షో టైమ్ అయిపోయిందంటూ చెప్పిన సమాధానం కోర్టు ఆగ్రహానికి ఆజ్యం పోసింది. న్యాయస్థానం ఆదేశాలంటే మీకు లెక్కలేదా అని ధర్మాసనం ఫైర్ అయ్యింది. “మేము వద్దని స్పష్టంగా చెప్పాక కూడా బుకింగ్స్ ఎలా తెరిచారు? ప్రభుత్వ ఆదేశాలను ఎందుకు బేఖాతరు చేశారు?” అని న్యాయమూర్తి నిలదీశారు. కోర్టు ప్రశ్నల దాటికి సరైన సమాధానం చెప్పలేక బుక్ మై షో ప్రతినిధులు మౌనం వహించాల్సి వచ్చింది. మొత్తం మీద ‘అఖండ-2’ విజయం సాధించినా, టికెట్ల రేట్ల విషయంలో జరిగిన ఉల్లంఘనలు మాత్రం బుక్ మై షోకు చిక్కులు తెచ్చిపెట్టాయి