భూకంపాల భయంతో జనాన్ని చంద్రమండలానికి పంపలేం కదా!”
* పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు.
ఢిల్లీ, మహా.
దేశంలో భూకంపాల ముప్పు, నష్ట నివారణ చర్యలపై దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మోహతాలతో కూడిన ధర్మాసనం పిటిషనర్ వాదనలపై అసహనం వ్యక్తం చేస్తూనే, కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. విపత్తు నిర్వహణ అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన అంశమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
భారత జనాభాలో దాదాపు 75 శాతం మంది భూకంప ప్రభావిత ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని, భవిష్యత్తులో భూకంపాల నుంచి ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ వాదనను పరిశీలించిన ధర్మాసనం.. దేశంలో అత్యధిక జనాభా భూకంప ముప్పు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారన్న కారణంతో, వారందరినీ మనం చంద్రునిపైకి తరలించలేం కదా అంటూ ఘాటుగా ప్రశ్నించింది.
విచారణ సమయంలో పిటిషనర్ జపాన్‌లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం, అక్కడి రక్షణ చర్యల గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు.. జపాన్ భౌగోళిక పరిస్థితులు వేరని గుర్తుచేశారు. “మీరు జపాన్‌తో పోల్చాలంటే, ముందుగా మనం భారతదేశంలోకి అగ్నిపర్వతాలను తీసుకురావాలి. అప్పుడే మన దేశాన్ని జపాన్‌తో పోల్చగలం” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టాన్ని ఎలా తగ్గించాలి, ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయాలనేది పూర్తిగా ప్రభుత్వం చూసుకోవాల్సిన విధానపరమైన విషయమని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం, అధికారులు చేయాల్సిన పనులను న్యాయస్థానం చేయలేదని, పరిపాలనాపరమైన నిర్ణయాల్లో కోర్టు జోక్యం తగదని తేల్చిచెబుతూ ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.








