Mahaa Daily Exclusive

  ఉపాధి హామీ ఇక ‘పూజ్య బాపు’..,

Share

ఉపాధి హామీ ఇక ‘పూజ్య బాపు’..
* రైతన్నకు ఏటా రూ. 10 వేలు
* 2027లో డిజిటల్ జనగణన.. 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలు
* కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు..
* రూ. 1.3 లక్షల కోట్లతో రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ.

ఢిల్లీ, మహా.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించేలా కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్యుడి నుంచి రైతుల వరకు, విద్యార్థుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకూ మేలు చేకూర్చేలా వరాల జల్లు కురిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చేలా ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులు చేయడంతో పాటు, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనగణనకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు.

*ఉపాధి హామీ పేరు మార్పు.. పని దినాల పెంపు*

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం మార్చింది. ఇకపై ఈ పథకాన్ని ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’ గా పిలవనున్నారు. పేరు మార్పుతో పాటు కూలీలకు శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ఏడాదికి 100 రోజులుగా ఉన్న పని దినాలను 120 రోజులకు పెంచింది. అలాగే రోజువారీ కూలీని రూ. 240గా నిర్ణయిస్తూ, ఈ పథకం కోసం ఏకంగా రూ. 1.51 లక్షల కోట్లను కేటాయించింది.

*రైతులకు రూ. 10 వేలు.. రాష్ట్రాలకు భారీ ప్యాకేజీ*

రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ మొత్తాన్ని భారీగా పెంచారు. ప్రస్తుతం ఏటా అందిస్తున్న రూ. 6,000 సాయాన్ని రూ. 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే దిశగా కేంద్రం పెద్ద మనసు చాటుకుంది. రాష్ట్రాలు తమ మూలధన వ్యయాన్ని పెంచుకునేందుకు వీలుగా వడ్డీ లేని రుణాల రూపంలో రూ. 1.3 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

*2027లో హైటెక్ జనగణన*

దేశంలో జనాభా లెక్కల సేకరణపై నెలకొన్న సందిగ్ధతకు కేంద్రం తెరదించింది. 2027లో రెండు విడతలుగా జనగణన నిర్వహించనున్నారు. ఇందుకోసం రూ. 11,718 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించారు. విశేషమేమిటంటే.. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి నిర్వహించనున్నారు.

*తెలుగు రాష్ట్రాలకు 8 కొత్త కేంద్రీయ విద్యాలయాలు*

విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కింది. తెలంగాణకు 4, ఆంధ్రప్రదేశ్‌కు 4 చొప్పున పాఠశాలలు మంజూరయ్యాయి. దీంతో పాటు దేశవ్యాప్తంగా డిజిటల్ సేవలను విస్తరించేందుకు భారత్ నెట్ ప్రాజెక్టుకు అదనంగా రూ. 8 వేల కోట్లు కేటాయించారు.

*గృహ నిర్మాణం, సాగునీటికి ఊతం*

పేదల సొంతింటి కలను నిజం చేస్తూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా 1.5 కోట్ల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాగునీటి రంగాన్ని పటిష్టం చేసేందుకు రూ. 35 వేల కోట్లతో జాతీయ మిషన్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 50 ప్రధాన, మధ్యస్థ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయనున్నారు. ఎంఎస్ఎంఈ లకు సులభంగా రుణాలు అందించేందుకు రూ. 15 వేల కోట్లతో కొత్త క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రారంభించారు.

*టెక్నాలజీ, రక్షణ రంగంలో నవశకం*

భవిష్యత్ సాంకేతికతపై దృష్టి సారిస్తూ సెమీకండక్టర్ల తయారీకి రూ. 12 వేల కోట్లు, క్వాంటం టెక్నాలజీ పరిశోధనలకు రూ. 4 వేల కోట్లు కేటాయించారు. అంతరిక్ష రంగంలోనూ కీలక ముందడుగు వేస్తూ తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద చిన్న ఉపగ్రహాల ప్రయోగానికి కొత్త లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’ను బలోపేతం చేయడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచారు. వీటితో పాటు నాలుగు కీలక రైల్వే ప్రాజెక్టులు, బొగ్గు గనుల సంస్కరణలు, సైబర్ సెక్యూరిటీ పాలసీ, టెలి-మెడిసిన్ నెట్‌వర్క్ వంటి అనేక కీలక నిర్ణయాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.

Latest