చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారైనా జైలుకే!
* ట్రాన్స్జెండర్లతో సీపీ సజ్జనార్ ప్రత్యేక భేటీ.
* శాంతిభద్రతలపై కీలక ఆదేశాలు.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ నగరంలో ట్రాన్స్జెండర్ల ప్రవర్తన, బలవంతపు వసూళ్లపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన ట్రాన్స్జెండర్లను గట్టిగా హెచ్చరించారు. హైదరాబాద్ నగర పోలీసులు అమీర్‌పేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఆడిటోరియంలో సుమారు 250 మంది ట్రాన్స్జెండర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సజ్జనార్, ట్రాన్స్జెండర్ల వ్యవహార శైలి, శాంతిభద్రతల పరిరక్షణపై దిశానిర్దేశం చేశారు. ఇటీవల కాలంలో ట్రాన్స్జెండర్ల మధ్య ఆధిపత్య పోరు, గ్రూపు తగాదాలు పెరిగిపోతున్నాయని, ఇవి శాంతిభద్రతల సమస్యలతో పాటు ప్రాణ నష్టానికి కూడా దారితీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా శుభకార్యాలు, పండుగల సమయంలో ఇళ్లపై పడి యజమానులను వేధించడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటి ఘటనలపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని సీపీ తెలిపారు. ఇటువంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని దౌర్జన్యాలకు పాల్పడితే, వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుని కటకటాల వెనక్కి పంపిస్తామని హెచ్చరించారు.
సమాజంలో అందరిలాగే ట్రాన్స్జెండర్లు కూడా గౌరవంగా జీవించాలని సజ్జనార్ సూచించారు. అనవసరమైన గొడవలు, కేసుల కారణంగా తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే జైలు శిక్షలు తప్పవని, ఇకపై బలవంతపు వసూళ్లను నగర పోలీసులు సహించబోరని ఆయన తేల్చిచెప్పారు.







