* తిరువనంతపురంలో కాషాయ జెండా.. కార్పొరేషన్‌లో బీజేపీ చారిత్రక విజయం
* తిరువనంతపురం మేయర్ పీఠం బీజేపీ కైవసం
* ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లకు షాక్.. రాజధానిలో కమల వికాసం
* ఇదో చారిత్రక విజయం: బీజేపీ గెలుపుపై రాజీవ్ చంద్రశేఖర్ హర్షం
* తొలి మహిళా డీజీపీ శ్రీలేఖ గెలుపు
హైదరాబాద్, మహా.
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంచలన విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్డీయే కూటమి ఏకంగా 50 వార్డులను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. దశాబ్దాలుగా ఇక్కడ పాతుకుపోయిన వామపక్ష కూటమి (ఎల్‌డీఎఫ్) ఆధిపత్యానికి గండికొడుతూ, మేయర్ పీఠాన్ని దక్కించుకునే దిశగా బీజేపీ దూసుకెళ్లింది.
మొత్తం 101 వార్డులకు గాను బీజేపీ కూటమి 50 వార్డులలో గెలుపొంది స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సుదీర్ఘకాలంగా ఈ కార్పొరేషన్‌ను ఏలుతున్న అధికార ఎల్‌డీఎఫ్ (కూటమి ఈసారి కేవలం 29 స్థానాలకే పరిమితమై గట్టి దెబ్బతిన్నది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 19 వార్డులకే పరిమితమై మూడో స్థానంలో నిలిచింది. రాజధాని నగరంలో పట్టు సాధించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ విజయం ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది.
ఈ ఫలితాలపై బీజేపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఈ విజయాన్ని ‘చారిత్రకమైనది’గా అభివర్ణించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫలితాలు పెను మార్పులకు నాంది పలుకుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తిరువనంతపురం కార్పొరేషన్ గెలుపును పునాదిగా చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ విజయం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన ప్రముఖులు కూడా విజయం సాధించడం గమనార్హం. కేరళ తొలి మహిళా డీజీపీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్. శ్రీలేఖ శాస్తమంగళం వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆమె గెలుపు పార్టీకి అదనపు బలాన్ని చేకూర్చింది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కూడా బీజేపీ ప్రదర్శనపై స్పందించారు. ఈ విజయం రాజధాని నగర రాజకీయాల్లో గణనీయమైన మార్పు అని ఆయన అంగీకరించారు. మొత్తానికి ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ రాజధానిలో కమల దళం జెండా ఎగురవేయడం జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమైంది.







