- మెస్సీ కోల్‌కతా పర్యటనలో ఉద్రిక్తత..
- మైదానాన్ని ధ్వంసం చేసిన ఫ్యాన్స్
- *మెస్సీకి క్షమాపణ చెప్పిన సీఎం మమత.
- సొరంగ మార్గంలో వెనుదిరిగిన మెస్సీ..
- బెంగాల్ సర్కార్‌పై గవర్నర్ సీరియస్
కోల్‌కతా,మహా.
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కోల్‌కతా పర్యటన అనూహ్య మలుపు తిరిగింది. ఎంతో ఆశగా తన ఆరాధ్య దైవాన్ని మైదానంలో చూసేందుకు వచ్చిన అభిమానులు, చివరికి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నిరాశ కాస్తా ఆగ్రహంగా మారి స్టేడియంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంతో ఆగ్రహించిన అభిమానులు మైదానాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో మెస్సీని భద్రతా సిబ్బంది సొరంగ మార్గం ద్వారా బయటకు తరలించాల్సి వచ్చింది.
*అసలేం జరిగింది?*
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీ కోల్‌కతా పర్యటనకు వస్తున్నారని, ఆయన అక్కడ మ్యాచ్ ఆడుతారని ప్రచారం జరిగింది. దీంతో తమ అభిమాన ఆటగాడి ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తారు. అయితే, స్టేడియానికి చేరుకున్న మెస్సీ, మైదానంలో కొద్ది క్షణాలు మాత్రమే ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మ్యాచ్ ఆడకుండానే మెస్సీ వెనుదిరగడంతో స్టేడియంలో వేచి చూస్తున్న ప్రేక్షకుల సహనం నశించింది.
*మైదానంలో విధ్వంసం*
తీవ్ర అసహనానికి గురైన అభిమానులు స్టేడియంలో వీరంగం సృష్టించారు. కుర్చీలను విసిరేస్తూ, ఏర్పాటు చేసిన ప్లెక్సీలను చించేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. కొందరు బారికేడ్లు దాటుకొని మైదానంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ గందరగోళం మధ్య మెస్సీ భద్రతపై ఆందోళన నెలకొనడంతో, నిర్వాహకులు ఆయన్ను హుటాహుటిన సొరంగ మార్గం (టన్నెల్) ద్వారా సురక్షితంగా బయటకు పంపించారు.
*క్షమాపణ చెప్పిన సీఎం.. సీరియస్ అయిన గవర్నర్*
ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. జరిగిన సంఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ గందరగోళానికి బాధ్యత వహిస్తూ ఆమె మెస్సీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మరోవైపు, మెస్సీ పర్యటన ఏర్పాట్ల వైఫల్యంపై రాష్ట్ర గవర్నర్ సీరియస్ అయ్యారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడి పర్యటనలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొంటూ, వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.







