- భూపాలపల్లి జిల్లాలో ఘోరం
- భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టి ఆపై ఆత్మహత్య చేసుకున్న భర్త
- భార్య, కూతురు వేధింపులే కారణమన్న వాట్సప్ స్టేటస్ లో పోస్ట్
భూపాలపల్లి, మహా : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. భార్యను ఉరివేసి చంపేసిన భర్త…ఆపై అతను కూడా అత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు భార్యను చంపేసిన తర్వాత తీసిన వీడియోను వాట్సాప్ స్టేటస్ గా పెటుకున్నాడు. చంపటానికి గల కారణాలను కూడా ఈ వీడియోలో చెప్పాడు. గమనించిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో .పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చంపేసి వాట్సాప్ స్టేటస్
ప్రాథమిక వివరాల ప్రకారం గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో బాలాజీ రామాచారి (50), సంధ్య దంపతులుగా ఉంటున్నారు. వీరి మధ్య కొంతకాలంగా విబేధాలు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య సంధ్యను ఉరి వేసి చంపేశాడు. తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేకాదు ఓ వీడియోను తన మొబైల్ లో వాట్సాప్ స్టేటస్ గా పెట్టాడు. భార్య, కూతురు వేధింపులు తాళలేక భార్యను చంపేసినట్లు ఆ వీడియో స్టేటస్ లో ఉంది. కష్టపడి పని చేసి డబ్బులు ఇస్తున్నప్పటికీ తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ వీడియోలో రామాచారి చెప్పాడు. తనకు ఏమాత్రం విలువ ఇవ్వటం లేదని పేర్కొన్నాడు. ఆ తర్వాత అతను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య భర్త ఇద్దరూ చనిపోవటంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మొదటి భార్య చనిపోగా రామాచారి, సంధ్యను రెండో వివాహం చేసుకున్నట్లు తెలిసింది. చంపేసిన తర్వాత పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూసిన బంధువులు, స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో ఇంటికి వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.







