- ట్రంప్ కు బిగ్ షాక్
- హెచ్-1బీ వీసా రుసుము పెంపునకు వ్యతిరేకంగా 20 రాష్ట్రాల్లో పిటిషన్లు
- ట్రంప్ ఆంక్షలు అమెరికన్ కాంగ్రెస్ కు విరుద్ధమంటున్న రాష్ట్రాలు
- కీలకమైన సేవలకు విఘాతం కలిగించే చర్య అని వెల్లడి
మహా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి బిగ్ షాక్ తగిలింది. ఆయన విధించిన లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుము నిబంధనను వ్యతిరేకిస్తూ కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్ సహా మొత్తం 20 రాష్ట్రాలు కోర్టులో సవాలు చేయనున్నాయి. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ ప్రకారం హెచ్-1బీ ప్రోగ్రామ్ అమెరికన్ యజమానులు “ప్రత్యేక వృత్తుల” కోసం విదేశీయులను ఉద్యోగులుగా నియమించుకోవడానికి అనుమతిస్తుంది. ట్రంప్ పరిపాలనపై న్యాయపరమైన సవాలును ప్రకటిస్తూ, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా ‘ఎక్స్’ లో “ట్రంప్ చట్టవిరుద్ధమైన కొత్త లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా రుసుము ఉపాధ్యాయులు, వైద్యులు, పరిశోధకులు, నర్సులు, ఇతర ముఖ్యమైన కార్మికుల కొరతకు కారణం కావచ్చు. ఇది కీలక సేవలను అందించే కాలిఫోర్నియా సామర్థ్యానికే ప్రమాదం కలిగిస్తుంది.” అని గతంలో రాశారు. బొంటా కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం కొత్త రుసుము “యజమానులకు, ముఖ్యంగా ప్రభుత్వ రంగం, ప్రభుత్వ యజమానులకు, ఈ స్థానాలను భర్తీ చేయడానికి ఖరీదైన అడ్డంకిని సృష్టిస్తుంది.” అని తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టులో ఈ దావా దాఖలు చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ట్రంప్ పరిపాలన హెచ్-1బీ విధాన మార్పును కోర్టులో సవాలు చేయడం ఇది మూడవసారి. గతంలో యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, కార్మిక సంఘాలు, యజమానులు, మతపరమైన సమూహాల కూటమి ఈ రుసుము పెంపును సవాలు చేశాయి.
ఈ రుసుము పెంపు చట్టవిరుద్ధమా?
బొంటా కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో దావాలో బొంటా, ఇతర అటార్నీ జనరల్‌లు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) అమలు చేసిన ఈ విధానం “చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తుంది” అని ఆరోపించారు. వారు చేసిన ఆరోపణల్లో కాంగ్రెస్ ఆమోదించిన పరిమితులను దాటి భారీ రుసుమును విధించడం అని పేర్కొంది. హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ఉద్దేశానికి ఇది విరుద్ధమని, అవసరమైన నియమాలను రూపొందించే ప్రక్రియలను పక్కన పెట్టడమని, అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్ (ఏపీఏ) కింద కార్యనిర్వాహక శాఖకు మంజూరు చేసిన అధికార పరిధిని ఇది అతిక్రమించడమని పేర్కొంది.
సాధారణంగా, హెచ్-1బీ వీసాల రుసుమును డీహెచ్ఎస్ నిర్ణయిస్తుంది. దీనికి ఏపీఏ నోటీసు అండ్ కామెంట్ ప్రక్రియను అనుసరిస్తారు. కాంగ్రెస్ అధికారం ప్రకారం, రుసుములు ఏజెన్సీ పనిని నిర్వహించడానికి అవసరమైన మొత్తానికి మాత్రమే పరిమితం చేయాలి. “సాధారణంగా, ప్రారంభ హెచ్-1బీ పిటిషన్‌ను దాఖలు చేసే యజమాని నియంత్రణ, చట్టబద్ధమైన రుసుములుగా 960 డాలర్ల నుంచి 7,595 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది,” అని ప్రకటన తెలిపింది. అయితే, కొత్తగా పెంచిన రుసుము హెచ్-1బీ దరఖాస్తుల ప్రాసెసింగ్ కోసం అయ్యే వాస్తవ ఖర్చును చాలా రెట్లు మించి ఉందని ఆ ప్రకటన పేర్కొంది.
బొంటా మీడియాతో మాట్లాడుతూ, “ఏ అధ్యక్షుడూ మన పాఠశాలలు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలను కేవలం తన ఇష్టం మేరకు అస్థిరపరచలేరు, అలాగే ఏ అధ్యక్షుడూ కాంగ్రెస్ వంటి సమాన ప్రభుత్వ శాఖను, రాజ్యాంగాన్ని లేదా చట్టాన్ని విస్మరించలేరు,” అని అన్నారు. ఈ చర్యపై దావా వేస్తున్న ‘బ్లూ స్టేట్‌లు’ (డెమోక్రాటిక్ నేతృత్వంలోని రాష్ట్రాలు) కూడా, పెంచిన రుసుమును ఏపీఏ అవసరమైన ‘నోటీసు-అండ్-కామెంట్ ప్రక్రియ’ లేకుండా జారీ చేశారని, ముఖ్యంగా ప్రభుత్వ, లాభాపేక్ష లేని సంస్థలు అందించే కీలక సేవలకు కలిగే నష్టాలను పరిగణించలేదని ఆరోపించాయి.
దావా వేసిన రాష్ట్రాలు కాలిఫోర్నియా, మసాచుసెట్స్, అరిజోనా, కొలరాడో, కనెక్టికట్,
డెలావేర్, హవాయి, ఇల్లినాయిస్, రీల్యాండ్, మిచిగాన్, మిన్నెసోటా, నెవాడా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, న్యూయార్క్, ఒరెగాన్, రోడ్ ఐలాండ్, వెర్మోంట్, వాషింగ్టన్, విస్కాన్సిన్ లు ఉన్నాయి. బొంటా కార్యాలయం ప్రకారం కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా, మసాచుసెట్స్ అటార్నీ జనరల్ జాయ్ కాంప్‌బెల్ ఈ దావాను దాఖలు చేయడంలో అన్ని ఇతర రాష్ట్రాల అటార్నీ జనరల్‌లకు నాయకత్వం వహిస్తున్నారు.







