Mahaa Daily Exclusive

  * డిసెంబర్ 20న కొత్త పాలకవర్గాల కొలువు…

Share

* డిసెంబర్ 20న కొత్త పాలకవర్గాల కొలువు.
* సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
* గ్రామ పంచాయతీల తొలి సమావేశం ఆ రోజే.
* గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం.

హైద్రాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్రంలో రెండవ సాధారణ ఎన్నికలలో గెలుపొందిన గ్రామ పంచాయతీ పాలకవర్గాల తొలి సమావేశానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం నుండి విడుదలైన తాజా ఉత్తర్వుల ప్రకారం, డిసెంబర్ 20 నాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలలో తొలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు తమ పదవీ బాధ్యతలను స్వీకరిస్తూ ప్రమాణం చేయనున్నారు.
ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ డాక్టర్ జి. సృజన గెజిట్ నోటిఫికేషన్ (సంఖ్య 63) విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబర్ 25, 2024న జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి ఎన్నికలు పూర్తయిన అన్ని గ్రామ పంచాయతీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అయితే, డిసెంబర్ 17 నాటికి ఎన్నికలు నిర్వహించలేకపోయిన పంచాయతీలకు మాత్రం ఈ తేదీ వర్తించదని, వాటికి సంబంధించి వేరే తేదీని తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని (మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ మినహా) మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లకు, జిల్లా ఎన్నికల అధికారులకు కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిసెంబర్ 20న జరిగే ఈ తొలి సమావేశంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల చేత నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత అధికారులదేనని మెమోలో పేర్కొన్నారు. దీంతో డిసెంబర్ 20 నుండి పల్లెల్లో కొత్త పాలకవర్గాల పాలన అధికారికంగా ప్రారంభం కానుంది.

Latest