సముద్రాలు దాటి వచ్చిన ‘విజయం’.
* కోడలిని గెలిపించిన మామ ఒక్క ఓటు.
* అమెరికా నుండి వచ్చి ఓటేశారు.
* ఒక్క ఓటు తేడాతో కోడలిని గెలిపించారు.
* నిర్మల్ జిల్లాలో ఆసక్తికర ఘటన.
హైదరాబాద్, మహా.
ప్రజాస్వామ్యంలో “ప్రతీ ఓటూ విలువైనదే” అని మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ ఆ ఒక్క ఓటు నిజంగానే గెలుపోటములను ఎలా శాసిస్తుందో, అధికారాన్ని ఎలా నిర్ణయిస్తుందో నిర్మల్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన కళ్ళకు కట్టినట్లు చూపించింది. ఒక్క ఓటు కదా అని నిర్లక్ష్యం చేయకుండా, ఏకంగా అమెరికా నుండి వచ్చి మరీ ఓటు వేసిన ఓ మామ.. తన కోడలికి అపురూప విజయాన్ని అందించారు.
*అమెరికా నుండి వచ్చి..*
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి ముత్యాల శ్రీవేద పోటీ చేశారు. తన కోడలు ఎన్నికల బరిలో నిలవడంతో, ఆమెకు మద్దతు తెలపడమే కాకుండా, తన ఓటు హక్కును వినియోగించుకోవాలని భావించిన శ్రీవేద మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి అమెరికా నుంచి బయలుదేరారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందే స్వగ్రామానికి చేరుకున్న ఆయన, పోలింగ్ రోజున బాధ్యతగా తన ఓటు వేశారు.
*ఉత్కంఠ రేపిన ఫలితం*
ఓట్ల లెక్కింపు సమయంలో ఫలితం అనూహ్యంగా మారింది. గ్రామంలో మొత్తం 426 ఓట్లు ఉండగా, 378 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ పూర్తయ్యేసరికి ముత్యాల శ్రీవేదకు 189 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు వచ్చాయి. కేవలం ఒక్క ఓటు.. ఒకే ఒక్క ఓటు తేడాతో శ్రీవేద సర్పంచ్‌గా విజయం సాధించారు. ఒక్క ఓటు కూడా చెల్లనిదిగా తేలింది.
*గెలిపించిన బాధ్యత*
ఈ ఫలితాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఒకవేళ ఇంద్రకరణ్ రెడ్డి గారు అమెరికాలోనే ఉండిపోయి ఉంటే, లేదా ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేసి ఉంటే నేడు ఫలితం మరోలా ఉండేది. ఆయన వేసిన ఆ ఒక్క ఓటే ఇప్పుడు నిర్ణయాత్మకమై, శ్రీవేదను విజయతీరాలకు చేర్చింది. ఆర్థికంగా విమాన టికెట్ ఖర్చుతో పోలిస్తే, ఆ ఓటు విలువ వెలకట్టలేనిదని ఈ విజయం నిరూపించింది.
*నగరవాసులకు గుణపాఠం*
ఇంటి పక్కనే పోలింగ్ బూత్ ఉన్నా, ఓటు వేయడానికి బద్ధకించే విద్యావంతులు, నగరవాసులకు ఈ ఘటన ఒక కనువిప్పు. ఓటు హక్కు మాత్రమే కాదు, అది ఒక బాధ్యత అని, ఒక్క ఓటుతో భవిష్యత్తు మారగలదని బాగాపూర్ ఫలితం చాటిచెప్పింది.







