- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం
- రాజకీయ పార్టీగా జాగృతిని మారుస్తాం
- త్వరలోనే గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు
- ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన
హైదరాబాద్, మహా : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆమె నెటిజన్లతో ‘ఆస్క్ కవిత’ పేరుతో క్వశ్చన్ అవర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ “మీ కొత్త పార్టీ పేరు ఏంటి?” అని ప్రశ్నించగా, “ఎలా ఉండాలో మీరే చెప్పండి” అంటూ కవిత సమాధానమిచ్చారు. త్వరలోనే జాగృతి సంస్థ కార్యకలాపాలను గ్రామస్థాయి వరకు విస్తరిస్తామని, ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాగృతి సంస్థ ద్వారానే ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. 2047 నాటికి దేశ ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడమే తన జీవిత లక్ష్యమని కవిత పునరుద్ఘాటించారు. ఇదే తన విజన్, మిషన్ అని ఆమె పేర్కొన్నారు. కవిత తాజా ప్రకటనతో ఆమె భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై చర్చ మొదలైంది.
జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కవిత సొంతగా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పలు నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. కొంత కాలంగా ప్రజా బాట పేరుతో నియోజకవర్గాలను చుట్టేస్తూ స్థానిక ప్రజలతో మమేకం కావడంతో పాటు సమస్యలపై వారితో మాట్లాడుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కీలక నేతలపై విమర్శలను గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఎక్స్‌లో ప్రజలతో తన అభిప్రాయాలు పంచుకునేందుకు ముందుకొచ్చారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి మీ ప్రశ్నలు, ఆలోచనలు ఆస్క్ కవితతో పంచుకోవాలంటూ ఆమె ట్వీట్ చేశారు. దీంతో యూజర్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే ఓ యూజర్ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగాడు. దీనికి కవిత అవును అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు పోటీగా ఎన్నికల బరిలోకి దిగనుందని క్లారిటీ వచ్చేసింది. జాగృతి కార్యక్రమాలు కేవలం నగరానికే పరిమితం చేశారు, ఎందుకు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించలేదని మరో యూజర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన కవిత రాష్ట్రవ్యాప్తంగా తాము పనిచేస్తున్నామని అన్నారు. తెలంగాణలో ప్రతీ గ్రామంలో కమిటీని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.








