Mahaa Daily Exclusive

  * సౌదీకి కళ్లెం.. పాక్‌కు చుక్కెదురు!

Share

* సౌదీకి కళ్లెం.. పాక్‌కు చుక్కెదురు!
* గల్ఫ్ పర్యటన వెనుక అసలు రహస్యం ఇదే..
* అగ్రరాజ్యాలకు ప్రత్యామ్నాయంగా భారత్.
* ఒమన్ నుంచి ఇథియోపియా దాకా.
* మోదీ అంతర్జాతీయ వ్యూహం!
* చైనా అప్పుల వల కాదు.. అమెరికా ఆంక్షలు లేవు.
* ఇది నయా భారత్ స్నేహం.

హైదరాబాద్, మహా.

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేపట్టిన జోర్డాన్, ఒమన్, ఇథియోపియా పర్యటనలు పైకి సాధారణ దౌత్య సమావేశాలుగా కనిపిస్తున్నప్పటికీ, వీటి వెనుక లోతైన అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వ్యూహాలు దాగి ఉన్నాయి. ఒకపక్క పాకిస్తాన్‌తో సౌదీ అరేబియా సాన్నిహిత్యం పెరుగుతున్న వేళ, గల్ఫ్, ఆఫ్రికన్ దేశాలలో భారత్ తన పట్టును నిలుపుకోవడానికి వేసిన వ్యూహాత్మక అడుగుగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్య విస్తరణ, ఇంధన భద్రత, చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటన.. అంతర్జాతీయ వేదికపై భారత్‌ను ‘దక్షిణ ప్రపంచ దేశాల’ (గ్లోబల్ సౌత్) నాయకుడిగా నిలబెట్టే దిశగా సాగింది.

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు ఎప్పుడూ ఒక నిర్దిష్ట లక్ష్యంతోనే సాగుతాయి. తాజాగా ఆయన చేపట్టిన మూడు దేశాల పర్యటన (ఒమన్, జోర్డాన్, ఇథియోపియా) ఇందుకు మినహాయింపు కాదు. సౌదీ అరేబియా వంటి దేశాలు పాకిస్తాన్‌తో సంబంధాలను పునరుద్ధరించుకుంటున్న ప్రస్తుత తరుణంలో, భారత్ తనదైన శైలిలో తటస్థ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం చర్చనీయాంశమైంది. కేవలం దౌత్యం మాత్రమే కాకుండా, మరో 40 దేశాలకు భారత వాణిజ్యాన్ని విస్తరించాలనే బృహత్తర ప్రణాళిక ఇందులో ఉంది.

*ఒమన్.. గల్ఫ్‌లో భారత్ నమ్మకమైన నేస్తం*

ఒమన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు పడటం ఈ పర్యటనలో అత్యంత కీలక పరిణామం. మధ్యప్రాచ్యంలో స్థానిక హిందూ జనాభా గణనీయంగా ఉన్న ఏకైక దేశం ఒమన్ కావడం గమనార్హం. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధానికి అద్దం పడుతోంది. ఖతార్ వంటి దేశాలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుండగా, ఒమన్ మాత్రం ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ వంటి దేశాల ఘర్షణల ప్రభావం తమ దేశంపై పడకుండా, శాంతియుత వాతావరణాన్ని కోరుకునే ఒమన్, భారత్‌కు అత్యంత నమ్మదగ్గ భాగస్వామిగా మారింది.
జోర్డాన్, ఇథియోపియా.. భవిష్యత్ వాణిజ్య ద్వారాలు
అటు జోర్డాన్, ఇటు ఇథియోపియాలు సైతం భారత్ వ్యూహంలో భాగమే. పాలస్తీనాతో స్నేహం చేస్తూనే, ఇజ్రాయెల్‌తోనూ సంబంధాలు నెరపుతున్న విలక్షణమైన దేశం జోర్డాన్. భవిష్యత్తులో “భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్థిక నడవ” కార్యరూపం దాల్చితే, జోర్డాన్ పాత్ర అందులో కీలకం కానుంది. ఇక ఆఫ్రికాలో భారత్ విస్తరణకు ఇథియోపియా ఒక ముఖద్వారం లాంటిది. 2024లో ‘బ్రిక్స్’ కూటమిలో ఇథియోపియా చేరడం, ఆఫ్రికన్ యూనియన్‌ను ‘జి-20’లో భారత్ చేర్పించడం వంటి పరిణామాలు ఆఫ్రికా దేశాల్లో భారత్ పట్ల సానుకూలతను పెంచాయి.

*అగ్రరాజ్యాలకు ప్రత్యామ్నాయంగా..*

ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు ఇచ్చే రుణాలకు రాజకీయ షరతులు ఉంటాయి. మరోవైపు చైనా ఇచ్చే రుణాలతో ‘బెల్ట్ అండ్ రోడ్’ పేరుతో దేశాలను అప్పుల ఊబిలో దించుతోంది. కానీ, భారత్ ఈ రెండు విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఏ దేశ అంతర్గత రాజకీయాల్లోనూ జోక్యం చేసుకోకుండా, కేవలం అభివృద్ధి భాగస్వామిగా మాత్రమే ఉండటంతో చిన్న దేశాలు భారత్ వైపు ఆకర్షితులవుతున్నాయి. ఇది వర్ధమాన దేశాలకు భారత్‌ను ఒక ఆశాకిరణంగా మార్చింది.

*రక్షణ, వైద్య రంగాల్లో లబ్ధి*

ఈ దౌత్య సంబంధాల వల్ల భారత్‌కు ఆర్థికంగానూ భారీ ప్రయోజనాలు ఉన్నాయి. భారతీయ రక్షణ పరికరాలను కొనుగోలు చేయడానికి ఈ దేశాలు ఆసక్తి చూపిస్తుండగా, వైద్యం కోసం పాశ్చాత్య దేశాల కంటే తక్కువ ఖర్చుతో కూడిన భారత్‌ను ఎంచుకుంటున్నాయి. వైద్య పర్యాటకం, రక్షణ ఎగుమతులు పెరగడానికి ఈ పర్యటనలు దోహదపడనున్నాయి. మొత్తంగా చూస్తే, మోదీ పర్యటన కేవలం స్నేహపూర్వకమే కాదు, భవిష్యత్ భౌగోళిక రాజకీయాల్లో భారత్ స్థానాన్ని సుస్థిరం చేసే ఒక గొప్ప ప్రయత్నమని చెప్పక తప్పదు.

Latest