Mahaa Daily Exclusive

  జర్మనీలో రాహుల్ గాంధీ పర్యటన…..

Share

జర్మనీలో రాహుల్ గాంధీ పర్యటన.
* బీఎండబ్ల్యూ కేంద్రం సందర్శన.
* భారతీయ నైపుణ్యంపై ప్రశంసలు.

ఢిల్లీ, మహా.

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన ఐరోపా పర్యటనలో భాగంగా జర్మనీలోని మ్యూనిక్ నగరంలో పర్యటించారు. అక్కడ ఉన్న ప్రపంచ ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ప్రధాన కార్యాలయాన్ని, ప్రదర్శనశాలను ఆయన బుధవారం సందర్శించి, వాహన రంగంలో వస్తున్న మార్పులను, ఆధునిక తయారీ విధానాలను దగ్గరుండి గమనించారు.
ఈ పర్యటనలో రాహుల్ గాంధీ బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జిఎస్ మోటార్‌సైకిల్‌ను ప్రత్యేకంగా పరిశీలించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మోటార్‌సైకిల్ భారతీయ దిగ్గజ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, బీఎండబ్ల్యూ భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న మోడల్ కావడం విశేషం. పరాయి గడ్డపై భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యం ప్రతిబింబించేలా ఉన్న ఈ వాహనంపై ఆయన కూర్చుని కాసేపు పరీక్షించారు. జర్మనీలో మన దేశ సాంకేతిక ప్రతిభను చూడటం ఎంతో గర్వకారణమని ఆయన ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన ప్లాంట్‌లోని మ్యూజియం విభాగాన్ని సందర్శించారు. అక్కడ చరిత్రలో నిలిచిపోయిన పాతకాలపు కారు ‘బీఎండబ్ల్యూ ఇసెట్టా’ను ఆసక్తిగా తిలకించారు. దీనిని ముద్దుగా ‘బబుల్ కార్’ అని పిలుస్తారు. అక్కడే ప్రదర్శించిన అత్యాధునిక మినీ కూపర్ కార్లు, ఇతర బీఎండబ్ల్యూ మోడళ్లను ఆయన వీక్షించారు. వాహన తయారీలో జర్మనీ పాటిస్తున్న ప్రమాణాలు, సాంకేతిక విప్లవం గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్శన ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా తయారీ రంగమే వెన్నుముక లాంటిదని, కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం భారతదేశంలో ఈ రంగం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి వేగవంతం కావాలంటే ఉత్పత్తిని పెంచాలని, సరైన వసతులు కల్పించి భారీ ఎత్తున నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ప్రస్తుతం ఐరోపా పర్యటనలో ఉంటూ ప్రవాస భారతీయులను, విద్యార్థులను, వివిధ రంగాల నిపుణులను కలుసుకుంటున్నారు. మ్యూనిక్ పర్యటనలో వాహన రంగాన్ని పరిశీలించడం ద్వారా, భారతదేశంలో ఉత్పాదక రంగానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఆయన మరోసారి గుర్తుచేశారు.