ప్రేమ వివాహంలో పెను విషాదం.
* అదనపు కట్నం కోసం నవవధువు హత్య.
* ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వివాహిత మృతి.
* ప్రేమను మరిచిన పశువు.. కన్నవారింటికి వెళ్తున్న భార్యను బలవంతంగా తెచ్చి హత్య.
* అనుష మృతిపై పోలీసుల దర్యాప్తు వేగవంతం.
హైదరాబాద్, మహా.
ప్రేమ వివాహం చేసుకున్న ఎనిమిది నెలలకే ఒక పచ్చని సంసారం అదనపు కట్నం వేధింపుల కారణంగా బూడిదయ్యింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో భర్త, అత్తమామల వేధింపుల తట్టుకోలేక, చివరకు భర్త చేతిలోనే తీవ్రంగా గాయపడి ఒక యువతి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతంలో నివసించే పరమేష్, అనుష (22) ఎనిమిది నెలల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన కొద్ది రోజుల నుంచే పరమేష్ తన అసలు రంగు బయటపెట్టాడు. అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే గత గురువారం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనుషను తన సోదరుడు పుట్టింటికి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నించగా, పరమేష్ అడ్డుకుని ఆమెను తిరిగి గదిలోకి తీసుకువెళ్ళి పాశవికంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అనుష అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. స్థానికుల సహాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అనుష మరణంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కట్నం కోసం ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన పరమేష్‌ను, వేధించిన అత్తమామలను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తరపు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.







