Mahaa Daily Exclusive

  గణతంత్ర వేడుకల్లో సరికొత్త అధ్యాయం….

Share

* గణతంత్ర వేడుకల్లో సరికొత్త అధ్యాయం.
* ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ అగ్రనేతలు.
* వాణిజ్య ఒప్పందమే లక్ష్యంగా.. భారత గణతంత్ర వేడుకలకు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌, ఆంటోనియో కోస్టా.
* తొలిసారిగా ఒకే వేదికపైకి రిపబ్లిక్ డే అతిథులుగా ఈయూ ప్రతినిధులు.

ఢిల్లీ, మహా.

భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒక అరుదైన ,చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానున్నాయి. ప్రతి ఏటా ఒక దేశాధినేతను మాత్రమే ఆహ్వానించే ఆనవాయితీకి భిన్నంగా, ఈసారి ఒక శక్తివంతమైన అంతర్జాతీయ కూటమికి చెందిన ఇద్దరు కీలక నాయకులను భారత ప్రభుత్వం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌తో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఈ వేడుకల్లో పాల్గొనడం ద్వారా భారత్, ఐరోపా సమాఖ్య మధ్య ఉన్న బలమైన సంబంధాలను ప్రపంచానికి చాటిచెప్పనున్నారు.
సాధారణంగా ఒకే దేశాధినేతను ఆహ్వానించే సంప్రదాయం ఉండగా, ఈసారి యూరోపియన్ యూనియన్ వంటి బహుళ దేశాల కూటమి నాయకులను ఎంపిక చేయడం వెనుక లోతైన రాజకీయ మరియు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య మారుతున్న వాణిజ్య పరిణామాల నేపథ్యంలో, ఐరోపా సమాఖ్యతో భారత్ బంధం మునుపెన్నడూ లేనంత ప్రాధాన్యత సంతరించుకుంది.
వచ్చే ఏడాది జనవరిలో న్యూఢిల్లీ వేదికగా భారత్-ఈయూ సమ్మిట్ జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశం ముగిసిన వెంటనే, ఈయూ అగ్రనేతలు రిపబ్లిక్ డే పరేడ్‌లో పాలుపంచుకోనున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ‘ఉచిత వాణిజ్య ఒప్పందం’ పై ఈ పర్యటనలో ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక విధానాల్లో వస్తున్న మార్పుల వల్ల భారత్ తన ఎగుమతుల కోసం ఐరోపా మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈయూ ట్రేడ్ కమిషనర్ మరోస్ కూడా ఒప్పందంపై సానుకూల సంకేతాలు ఇచ్చారు.
భారత్ , యూరోపియన్ యూనియన్ మధ్య కేవలం వాణిజ్యమే కాకుండా, రక్షణ, సాంకేతికత, వాతావరణ మార్పుల వంటి అంశాల్లో కూడా వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ఈ ఆహ్వానం ద్వారా ఐరోపా ఖండంలోని 27 దేశాలతో సంబంధాలను ఒకేసారి బలోపేతం చేసుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈయూ అగ్రనేతల రాకతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రాబల్యం మరింత పెరుగుతుందని, ముఖ్యంగా రక్షణ రంగంలో ఐరోపా సాంకేతికత భారత్‌కు మరింత చేరువయ్యే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Latest