కమలం గూటికి నటి ఆమని.
* నేడు మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీలో చేరిక.
* రామచందర్ రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్న ‘శుభలగ్నం’ నటి.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర రాజకీయాల్లోకి మరో సినీ గ్లామర్ వచ్చి చేరుతోంది. సీనియర్ నటి ఆమని ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలైన ఆమె శనివారం అధికారికంగా కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆధ్వర్యంలో ఆమె పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.
*తొలి నుంచి సానుకూలత..*
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై మొదటి నుంచి సానుకూలత వ్యక్తం చేస్తున్న ఆమని, దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలనే ఉద్దేశంతోనే బీజేపీని ఎంచుకున్నట్లు సమాచారం. ‘మిస్టర్ పెళ్ళాం’, ‘శుభలగ్నం’ వంటి చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులకు అత్యంత చేరువైన ఆమె రాకతో, పార్టీకి మహిళా ఓటర్లలో ఆదరణ పెరుగుతుందని కమలనాథులు భావిస్తున్నారు. పార్టీలో చేరిన వెంటనే ఆమెకు రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
*ఎన్నికల దిశగా కమల దళం..*
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తన బలాన్ని పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే సినీ రంగానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. గతంలోనే పలువురు నటులు బీజేపీలో చేరగా, ఇప్పుడు ఆమని రాక పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. రామచందర్ రావు నేతృత్వంలో జరుగుతున్న ఈ చేరికల పర్వం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరిన అనంతరం ఆమె మీడియా సమావేశంలో పాల్గొని తన రాజకీయ కార్యాచరణను వెల్లడించనున్నారు.








