* తెలంగాణ సాగులో ‘నానో’ విప్లవం.
* ప్రభుత్వ ఖజానాకు రూ. 5,000 కోట్ల పొదుపు!
* ‘యూరియా యాప్’తో అన్నదాతకు సరికొత్త భరోసా!
* ఫోన్ కొడితే ఇంటికే ఎరువులు.. డ్రోన్లతో ఆకాశం నుంచి సాగు అమృతం!
* బస్తాల మోతకు కాలం చెల్లింది.. నానో బాటిళ్లతో రైతులకు రూ. 2,000 కోట్ల అదనపు లాభం!
* డిజిటల్ మ్యాపింగ్‌తో ఎరువుల దందాకు చెక్.
* పారదర్శక సాగులో దేశానికే ఆదర్శం తెలంగాణ!
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగు విస్తీర్ణం కోటిన్నర ఎకరాలకు పైగా పెరగడంతో, ఎరువుల డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరిగింది. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో ఎరువుల దుకాణాల వద్ద కనిపించే తోపులాటలు, ఆధార్ కార్డుల కోసం గంటల తరబడి నిరీక్షణ రైతులకు శాపంగా మారేవి. అయితే, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ‘యూరియా బుకింగ్ యాప్’ ‘నానో యూరియా’ను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవడం నుండి, డ్రోన్ల ద్వారా పిచికారీ చేసే వరకు సాగు మొత్తం హైటెక్ హంగులు అద్దుకుంది. ఇది కేవలం రైతుకు శ్రమ తగ్గించడమే కాకుండా, రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక రంగాలకు ఊపిరి పోస్తోంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏటా సుమారు 20 నుండి 22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతున్నట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంటే రాష్ట్రంలోని రైతులు సుమారు 4.8 కోట్ల యూరియా బస్తాలను వినియోగిస్తున్నారు. ఒక సాధారణ యూరియా బస్తాపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ అక్షరాలా 2,200 రూపాయలకు పైగా ఉంది. రైతుకు కేవలం 266 రూపాయలకే బస్తా అందుతున్నప్పటికీ, ప్రభుత్వంపై ఏటా సుమారు 10,000 కోట్ల రూపాయల సబ్సిడీ భారం పడుతోంది. అయితే, సంప్రదాయ యూరియా స్థానంలో నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ భారాన్ని సగానికి పైగా తగ్గించే అవకాశం ఏర్పడింది. నానో యూరియా బాటిళ్లకు భారీగా సబ్సిడీ అవసరం లేకపోవడం వల్ల, రాష్ట్రవ్యాప్తంగా ఈ సాంకేతికతను పూర్తిస్థాయిలో అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాకు ఏటా 5,000 కోట్ల రూపాయలకు పైగా ఆదా అవుతుందని ఆర్థిక నిపుణుల విశ్లేషణలో తేలింది.
రైతుల వ్యక్తిగత ఆదాయం విషయానికి వస్తే, నానో యూరియా వాడకం ఒక వరంగా మారింది. ఒక 45 కిలోల యూరియా బస్తాను తరలించడానికి, కూలీలతో పొలంలో చల్లించడానికి రైతుకు బస్తాకు సగటున 100 నుండి 150 రూపాయల వరకు అదనపు ఖర్చు అవుతుంది. అదే నానో యూరియా బాటిల్ అయితే రవాణా ఖర్చు సున్నా అవుతుంది. డ్రోన్ టెక్నాలజీని జోడించడం ద్వారా ఎకరానికి పిచికారీ ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతోంది. తెలంగాణవ్యాప్తంగా సాగవుతున్న కోటిన్నర ఎకరాల్లో నానో యూరియా వినియోగించడం వల్ల పెరిగే దిగుబడి (సుమారు 8-12 శాతం) తగ్గే పెట్టుబడి ఖర్చులను కలిపి లెక్కకడితే, రాష్ట్ర రైతులకు ఏటా అదనంగా 2,000 నుండి 2,500 కోట్ల రూపాయల నికర లాభం చేకూరనుంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.
డిజిటల్ పంపిణీ వ్యవస్థలో భాగంగా ప్రవేశపెట్టిన ‘యూరియా బుకింగ్ యాప్’ పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. పట్టాదారు పాస్ పుస్తకాలతో అనుసంధానమైన ఈ యాప్ ద్వారా, ఏ రైతుకు ఎంత భూమి ఉందో ఆ మేరకు మాత్రమే ఎరువులు సరఫరా అవుతాయి. దీనివల్ల దళారులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముకునే దందాకు అడ్డుకట్ట పడింది. ఎకరానికి లోపు ఉన్న రైతులకు ఒక దఫాలో, ఐదు ఎకరాల లోపు వారికి రెండు దఫాలుగా ఎరువులు అందజేస్తున్నారు. ప్రతి 15 రోజుల గ్యాప్‌తో ఎరువులు పంపిణీ చేయడం వల్ల రైతులు అనవసరంగా స్టాక్ పెట్టుకునే అవసరం లేకుండా పోయింది. ఈ డిజిటల్ మ్యాపింగ్ వల్ల ఎరువుల దుర్వినియోగం తగ్గి, నిజమైన అర్హులైన రైతులకు సకాలంలో ఎరువులు అందుతున్నాయి.
ఇక డ్రోన్ల వినియోగం తెలంగాణ సాగు రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తోంది. రాష్ట్రంలోని వివిధ మండల కేంద్రాల్లో ఇఫ్కో, ఇతర సహకార సంస్థల ఆధ్వర్యంలో డ్రోన్లను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఎకరం పొలంలో యూరియా చల్లడానికి పట్టే సమయం ఇప్పుడు కేవలం 10 నిమిషాలకు తగ్గిపోయింది. దీనివల్ల ఎరువు వృధా కాకుండా మొక్క ఆకులకు నేరుగా చేరి, తక్కువ సమయంలోనే అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. సంప్రదాయ యూరియా వల్ల భూమి సారం దెబ్బతినే ప్రమాదం ఉండేది, కానీ నానో టెక్నాలజీ వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతోంది. మొత్తానికి యాప్ ద్వారా బుకింగ్, డ్రోన్ ద్వారా పిచికారీ, నానో ద్వారా అధిక దిగుబడి.. ఈ మూడంచెల వ్యూహంతో తెలంగాణ వ్యవసాయం దేశానికే దిక్సూచిగా మారుతోంది.








