Mahaa Daily Exclusive

  అవినీతి కాంగ్రెస్ ను సాగరం పాలు చేసిన ఏపీకి హ్యాట్సాఫ్:విశాఖలో కేంద్ర మంత్రి బండి

Share

కాంగ్రెస్ అవినీతి విషవృక్షం.
* ఏపీ తరహాలోనే కూకటివేళ్లతో పెకిలిస్తాం.
* తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయం.
* అవినీతి కాంగ్రెస్ ను సాగరం పాలు చేసిన ఏపీకి హ్యాట్సాఫ్.
* విశాఖలో కేంద్ర మంత్రి బండి సంజయ్.
విశాఖపట్నం, మహా.

దశాబ్దాల పాటు దేశాన్ని పట్టి పీడించిన కాంగ్రెస్ పార్టీని ఒక అవినీతి విషవృక్షంగా అభివర్ణిస్తూ, ఆ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి సముద్రంలో కలిపేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజకీయ చైతన్యం దేశానికే ఆదర్శమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘అటల్, మోదీ సుపరిపాలన యాత్ర’లో భాగంగా శనివారం ఆయన విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా సాగరతీర నగరంలో బీజేపీ శ్రేణులు, స్థానిక నేతలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. విశాఖ వేదికగా జరిగిన సభలో బండి సంజయ్ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ విధానాలపై, ఆ పార్టీ అవినీతి చరిత్రపై నిప్పులు చెరిగారు. దేశానికి చీడపురుగులా మారిన కాంగ్రెస్ విషవృక్షాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో గాలికొదిలేశారని, ఇప్పుడు అదే స్ఫూర్తితో తెలంగాణ గడ్డపై కూడా ఆ పార్టీని బొందపెట్టి, డబుల్ ఇంజిన్ సర్కార్ ను ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఇక్కడి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ (కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం) అందిస్తున్న ఫలాలను చూసి తెలంగాణ ప్రజల్లోనూ స్పష్టమైన మార్పు మొదలైందని సంజయ్ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపారమైన అనుభవం, విజన్ ఉన్న నాయకుడని, ఆయన దార్శనికత రాష్ట్రానికి రక్షాకవచమని కొనియాడారు. పొరుగున ఉన్న ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూశాక, తెలంగాణలోనూ బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకతను ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. గతంలో తాను, ప్రస్తుత ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కలిసి పార్టీ బలోపేతం కోసం ఢిల్లీలో చెప్పులు అరిగేలా తిరిగామని, ఆనాటి కష్టానికి నేడు ఫలితం దక్కుతోందని, త్వరలోనే తెలంగాణలోనూ కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయమని, రాష్ట్రమంతటా వాజ్ పేయి విగ్రహాలను నెలకొల్పి సుపరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు.

దేశ రాజకీయాల్లో విలువలకు నిలువుటద్దంలా నిలిచిన మహానాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి అని బండి సంజయ్ స్మరించుకున్నారు. పదవుల కోసం పాకులాడకుండా, పదవికే వన్నెలద్దిన మహోన్నతుడు వాజ్ పేయి అని కొనియాడారు. ఒక డొక్కు స్కూటర్ పై దేశమంతా పర్యటించి, సామాన్యుడికి చేరువైన అటల్ జీ.. ఎన్నిసార్లు గెలిచామన్నది కాకుండా ఎందరి మనసులు గెలిచామన్నదే కొలమానంగా బతికారని గుర్తు చేశారు. ఆయన కలలు గన్న ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ (కాంగ్రెస్ రహిత భారత్) ఆశయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారని తెలిపారు. వాజ్ పేయి వేసిన పునాదుల పైనే నేడు మోదీ దేశాన్ని ఆర్థికంగా ప్రపంచంలోనే 4వ శక్తివంతమైన దేశంగా నిలిపారని, ఇది బీజేపీ సుపరిపాలనకు నిదర్శనమని అన్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులు సైతం తలవంచి గౌరవించే వ్యక్తిత్వం వాజ్ పేయి సొంతమని, ఆయన ఒక వెలలేని భారత రత్నమని భావోద్వేగంతో ప్రసంగించారు.

*వైజాగ్ వాసులది సముద్రమంత మనసు*

విశాఖపట్నం నగరంపై, ఇక్కడి ప్రజల ఆప్యాయతపై బండి సంజయ్ తనదైన శైలిలో ప్రశంసల జల్లు కురిపించారు. వైజాగ్ నగర వాతావరణంలోనే ఒక మ్యాజిక్ ఉందని, ఇక్కడికి వస్తే ఎంతటి వారికైనా బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఎగిరిపోతాయని చమత్కరించారు. ఇక్కడి సముద్రం ఎంత విశాలంగా ఉంటుందో.. విశాఖ వాసుల హృదయం కూడా అంతే విశాలమని అన్నారు. ఈ నగరం కేవలం ప్రకృతి అందాలకే కాదు, చారిత్రాత్మక పోరాటాలకు కూడా ప్రసిద్ధి అని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు సంకల్పం, ఇక్కడి ప్రజల పోరాట పటిమ తెలుగుజాతికి గర్వకారణమని పేర్కొన్నారు.

*బండికి ఘన స్వాగతం.. ‘అల్లూరి’తో పోలిక*

విశాఖ పర్యటనలో భాగంగా బండి సంజయ్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ నేతలు బండి సంజయ్ ను ఆకాశానికెత్తారు. బండి సంజయ్ సామాన్య నేత కాదని, తెలంగాణ రాజకీయాల్లో ఆయనొక సంచలనం అని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభివర్ణించారు. తెలంగాణలో అలుపెరుగని పోరాటం చేస్తున్న బండి సంజయ్.. అచ్చం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును తలపిస్తున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రాజు కొనియాడారు. బండి సంజయ్ తమకు అత్యంత ఇష్టమైన ఫైర్ బ్రాండ్ నేత అని గంటా శ్రీనివాసరావు ప్రశంసించారు. పర్యటనలో భాగంగా సంజయ్.. వైజాగ్-భీమిలీ రోడ్డులోని శ్రీ మొగదారమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.