ఆకాశమే హద్దు.. విలాసమే ప్రాణం.
* మేఘాల మధ్యన అపురూప ఆతిథ్యం.
* ప్రపంచ శిఖరాగ్రాన విలాసాల స్వర్గం.
* బుర్జ్ ఖలీఫా గర్భంలో అద్భుత లోకం.
* బుర్జ్ ఖలీఫా ‘అర్మానీ’ హోటల్ అద్భుత దృశ్యకావ్యం!
దుబాయ్,మహా.
ఎడారి నడిబొడ్డున ఆకాశమే సరిహద్దుగా నిలిచిన అద్భుతం బుర్జ్ ఖలీఫా. ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం గురించి వినని వారుండరు. కానీ, ఆ మహా శిఖరం గర్భంలో దాగి ఉన్న అసలైన విలాసం ‘అర్మానీ హోటల్’. ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ దిగ్గజం జార్జియో అర్మానీ తన అద్భుత సృజనాత్మకతకు ప్రాణం పోసి తీర్చిదిద్దిన ఈ హోటల్, పర్యాటకులకు కేవలం ఒక బస మాత్రమే కాదు, అదొక మరపురాని జీవితకాల అనుభూతి. 2010లో ప్రారంభమైన ఈ విలాసాల నిలయం నేటికీ ప్రపంచ పర్యాటక రంగంలో అత్యున్నత ప్రమాణాలకు మారుపేరుగా నిలుస్తోంది. హోటల్ ముఖద్వారం వద్దకే రాగానే 828 మీటర్ల ఎత్తున మేఘాలను తాకుతున్నట్లు కనిపించే బుర్జ్ ఖలీఫా మనల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది.
లోపలికి అడుగుపెట్టగానే జార్జియో అర్మానీ ట్రేడ్‌మార్క్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎత్తైన పైకప్పులు, హుందాతనం ఉట్టిపడే లాబీ, ఎటు చూసినా ఇటాలియన్ శైలిలో అమర్చిన సోఫాలు పర్యాటకులను మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడ ప్రతి వస్తువులోనూ ఒక కళాత్మకత దాగి ఉంటుంది. హోటల్‌లోని 5 నుంచి 8వ అంతస్తు వరకు, అలాగే 38, 39 అంతస్తుల్లో అతిథుల కోసం గదులను కేటాయించారు. మధ్యలోని 9 నుంచి 16 అంతస్తులను ‘అర్మానీ రెసిడెన్సీ’గా పిలుస్తారు. హోటల్‌లో బస చేసే అతిథుల కోసం ఏర్పాటు చేసిన ‘ఫౌంటెన్ సూట్’ గదుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడి బెడ్‌రూమ్ కిటికీలో నుంచి చూస్తే ప్రపంచ ప్రసిద్ధ దుబాయ్ ఫౌంటెన్ షో కళ్ళముందే సాక్షాత్కరిస్తుంది. గదిలోని ప్రతి వస్తువుపై, ఆఖరికి పెన్సిల్, పెన్ నుంచి బాటిల్ ఓపెనర్ వరకు ప్రతి దానిపై ‘అర్మానీ’ బ్రాండ్ ముద్ర ఉండటం విశేషం.
ఇక్కడి డైనింగ్ అనుభవం ఆహార ప్రియులకు ఒక పండుగలాంటిది. ముఖ్యంగా ‘అమల్’ అనే ఇండియన్ రెస్టారెంట్ భారతీయులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. దీని టెర్రస్ మీద కూర్చుని రాత్రి వేళ భోజనం చేస్తూ, మ్యూజిక్‌కు తగ్గట్టుగా నాట్యం చేసే ఫౌంటెన్ జలధారలను చూడటం పర్యాటకులకు మంత్రముగ్ధులను చేస్తుంది. చిక్కటి భారతీయ రుచులతో పాటు, ఇటాలియన్ బ్రాండ్ ‘మర్విస్’ వంటి ఉత్పత్తులు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక ఉదయం వేళ ‘మెడిటరేనియో’ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసే బ్రేక్‌ఫాస్ట్ బఫేలో అరబిక్, భారతీయ మరియు పాశ్చాత్య వంటకాలు కొలువుదీరుతాయి. చికెన్ టిక్కా నుంచి బిర్యానీ వరకు, రకరకాల డెజర్ట్‌ల నుంచి పండ్ల రసాల వరకు ప్రతిదీ అత్యంత నాణ్యతతో వడ్డిస్తారు.
విశ్రాంతి మరియు ఆరోగ్యం కోసం ఇక్కడ ఉన్న ‘అర్మానీ స్పా’ మరో ప్రత్యేక ఆకర్షణ. మూడవ అంతస్తులో ఉన్న ఈ స్పాలో జిమ్, సాగునా మరియు వి-ఆకారంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ పర్యాటకులకు గొప్ప ఉల్లాసాన్ని ఇస్తాయి. పూల్ లో పడుకుని పైకి చూస్తే బుర్జ్ ఖలీఫా అంచు వరకు స్పష్టంగా కనిపిస్తుంది. పక్కనే ఉన్న దుబాయ్ మాల్‌తో ఈ హోటల్ నేరుగా అనుసంధానించబడి ఉండటం వల్ల షాపింగ్ ప్రియులకు ఇది స్వర్గధామంలా అనిపిస్తుంది. ఒక రాత్రి బసకు సుమారు 5,200 దిర్హామ్స్ (భారత కరెన్సీలో దాదాపు 1.20 లక్షల రూపాయల పైచిలుకు) ఖర్చవుతున్నప్పటికీ, అచ్చమైన విలాసాన్ని, అపురూపమైన ఆతిథ్యాన్ని కోరుకునే వారికి అర్మానీ హోటల్ తప్పక సందర్శించాల్సిన గమ్యస్థానం.







