Mahaa Daily Exclusive

  హరేకృష్ణ మూవ్ మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా “హెరిటేజ్ ఫెస్ట్”

Share

  • హరేకృష్ణ మూవ్ మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా “హెరిటేజ్ ఫెస్ట్”
  • సాంస్కృతిక విలువలు, యువ ప్రతిభతో వార్షిక ఉత్సవం

హైదరాబాద్, హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ – డిసెంబర్ 20, 2025 (శనివారం) :
హరేకృష్ణ మూవ్’మెంట్, హైదరాబాద్ ఆధ్వర్యంలో వార్షిక సాంస్కృతిక ఉత్సవం “హెరిటేజ్ ఫెస్ట్” హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, బంజారాహిల్స్‌లో ఘనంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. భారతీయ సాంస్కృతి ద్వారా విద్యార్థుల్లో మేధస్సును వికసింపజేయడం, నైతిక విలువలను పెంపొందించడమే లక్ష్యంగా హరేకృష్ణ మూవ్’మెంట్’కు చెందిన సాంస్కృతిక విభాగం సుమేధస (SUMEDHASA) ఈ ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమంగా నిర్వహించింది.
హెరిటేజ్ ఫెస్ట్ ఉత్సవం, హరేకృష్ణ మూవ్ మెంట్ యొక్క ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా, భారతదేశపు సాంస్కృతిక, నైతిక మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ, యువ కిశోరాల ప్రతిభకు సృజనాత్మక వేదికను అందిస్తోంది. ఈ తరహాలో జరిగిన అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ఉత్సవంలో, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 60కిపైగా పాఠశాలల నుంచి సుమారు 12,000 మంది విద్యార్థులు హెరిటేజ్ ఫెస్ట్’లో పాల్గొన్నారు. అనేక నెలల పాటు నిర్వహించిన పోటీల్లో క్వాలిఫైయింగ్ రౌండ్లు, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్‌ కేటగిరీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పోటీ పడ్డారు.
ఈ సందర్భంగా హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి హరిచందన దాసరి, ఐఏఎస్, జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్, హైదరాబాద్ గారు హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, ఎం.టెక్ (IIT–మద్రాస్), అధ్యక్షులు – హరే కృష్ణ మూవ్ మెంట్, హైదరాబాద్, మరియు ప్రాంతీయ అధ్యక్షులు – అక్షయపాత్ర ఫౌండేషన్ (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) అధ్యక్షత వహించారు.
తొలుత దీప ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆలపించిన వేద మంత్రోచ్ఛారణలు, వేదికకు మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరింపజేసింది. అనంతరం బహుమతి పొందిన విద్యార్థులు శాస్త్రీయ, జానపద నృత్యాలు, గాన సంగీతం, గీతా శ్లోక పఠనం, వేదిక్ క్విజ్, చిత్రలేఖనం, కథన ప్రదర్శనలు, రంగోలి, పురాణ పాత్రల వేషధారణలతో ప్రేక్షకులను అలరించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్యం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి మనసులను హత్తుకుంది.
మొత్తం 170 మందికిపైగా విద్యార్థులకు బహుమతులు, ట్రోఫీలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. విశేష ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు రోలింగ్ ఛాంపియన్స్ ట్రోఫీలు సైతం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, న్యాయనిర్ణేతలు, గౌరవ అతిథులు, వేదిక భాగస్వాములు ఉత్సాహంగా పాల్గొనగా, వారందరినీ ప్రత్యేకంగా సన్మానించారు.
ముఖ్యఅతిథి శ్రీమతి హరిచందన దాసరి, ఐఏఎస్ గారు, సభను ఉద్దేశించి మాట్లాడుతూ విభిన్న పోటీల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన విజేతలను అభినందించారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్యాలు మరింత చురుకుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఫలితంగా విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి తోడ్పటంతో పాటు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు మరియు బృందస్పూర్తిని సైతం పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో భారతదేశపు శాశ్వత వారసత్వం, సంస్కృతి సాంప్రదాయం మరియు నైతిక విలువల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న హరేకృష్ణ మూవ్ మెంట్ కృషిని కలెక్టర్ గారు ప్రశంసించారు.
శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా 60కిపైగా పాఠశాలల నుంచి సుమారు 12,000 మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని ఏడు వేదికలలో ఈ పోటీలు నిర్వహించబడినట్లు ప్రభూజీ తెలిపారు. హెరిటేజ్ ఫెస్ట్ ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందడమే కాకుండా, నాయకత్వ లక్షణాలు, బృందంగా పనిచేసే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. నేటి ఆధునిక కాలంలో హెరిటేజ్ ఫెస్ట్ లాంటి కార్యక్రమాలు పిల్లలకు భారతీయ సాంస్కృతి ఆధారిత నైతిక, ఆధ్యాత్మిక విలువలను అందిస్తూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతోందని ప్రభూజీ పేర్కొన్నారు. హెరిటేజ్ ఫెస్ట్ కేవలం పోటీల సమూహారం మాత్రమే కాకుండా, సమగ్ర విద్యాభివృద్ధికి దోహదపడేలా ఒక అర్థవంతమైన మూవ్’మెంట్ అని స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి లభించిన విశేష స్పందన నేపథ్యంలో, వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా “హెరిటేజ్ ఫెస్ట్‌”ను నిర్వహించనున్నట్లు హరేకృష్ణ మూవ్’మెంట్ ప్రకటించింది. యువతలో సాంస్కృతి, విలువలు, ప్రతిభను పెంపొందించాలన్న తమ సంకల్పాన్ని మరోసారి పునరుద్ఘాటించింది.

ధన్యవాదాలతో,
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO)
హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్,
హరే కృష్ణ మూవ్‌మెంట్ – హైదరాబాద్
రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్