Mahaa Daily Exclusive

  ట్యాపింగ్ కేసులో ‘సిట్’ దూకుడు….

Share

* ట్యాపింగ్ కేసులో ‘సిట్’ దూకుడు.
* ప్రతి ఒక్కరినీ విచారించాలని సజ్జనార్ ఆదేశం.
* ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు.
* కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా సిట్ కీలక భేటీ.
* మూలాలను వెలికితీసే పనిలో సజ్జనార్ టీమ్.
హైదరాబాద్, మహా.

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన వేగాన్ని పెంచింది. ఈ కేసును అత్యంత కీలకంగా భావిస్తున్న ప్రభుత్వం, సమగ్ర విచారణ కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్, ఆదివారం నాడు హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో సిట్ చైర్మన్ సజ్జనార్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ, ఈ ఉదంతంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించి తీరాలని స్పష్టం చేశారు. ఎవరినీ వదిలిపెట్టకుండా లోతైన దర్యాప్తు జరిపి, పటిష్టమైన సాక్ష్యాధారాలతో కూడిన పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేయాలని ఆయన నిర్ణయించారు.
ఈ కేసు దర్యాప్తును ప్రొఫెషనల్ పద్ధతిలో నిర్వహించేందుకు తొమ్మిది మంది అనుభవజ్ఞులైన అధికారులతో కూడిన పటిష్టమైన బృందాన్ని ప్రభుత్వం రంగంలోకి దించింది. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్‌.ఎమ్‌. విజయ్‌కుమార్‌, రామగుండం సీపీ అంబర్ కిషోర్‌ ఝా, మాదాపూర్ డీసీపీ రితిరాజ్‌, మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డి వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు గ్రేహౌండ్స్‌ గ్రూప్ కమాండర్‌ ఎం. రవీందర్‌ రెడ్డి ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. వీరికి తోడుగా రాజేంద్రనగర్ అడిషనల్‌ డీసీపీ కేఎస్‌ రావు, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరి, టీజీ న్యాబ్‌ డీఎస్పీ జీహెచ్ శ్రీధర్‌, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ డీఎస్పీ నాగేందర్ రావు తమ సేవలందించనున్నారు. సమావేశంలో సజ్జనార్ సిట్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటివరకు జరిగిన విచారణ పురోగతిని సమీక్షించడంతో పాటు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ట్యాపింగ్ వ్యవహారంలో తెరవెనుక ఉన్న వ్యక్తులు ఎంతటి వారైనా సరే చట్టం ముందు నిలబెట్టాలని, సాంకేతిక ఆధారాలను పక్కాగా సేకరించాలని సూచించారు. ఈ కేసులో సాక్ష్యాల తారుమారుకు తావులేకుండా పారదర్శకంగా దర్యాప్తు పూర్తి చేసి, త్వరలోనే తుది నివేదిక సిద్ధం చేయాలని బృందానికి ఆదేశాలిచ్చారు. సిట్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Latest