Mahaa Daily Exclusive

  ‘శంకర్ దాదా’లా మారితే రోగులకు ప్రమాదమే…

Share

‘శంకర్ దాదా’లా మారితే రోగులకు ప్రమాదమే.
* వైద్య వృత్తి వ్యాపారం కాకూడదు.. సేవే పరమావధి కావాలి
* ఆ రోజు 12 సార్లు షాక్ ఇచ్చి నన్ను బతికించారు.
* ఎంబీబీఎస్ అంటే ట్వంటీ-20 కాదు.. ఓపికతో ఆడే టెస్ట్ మ్యాచ్
* వైద్యంపై కార్పొరేట్ నీడ పడొద్దు.. మెడికోలకు కేంద్రమంత్రి బండి సంజయ్ హితవు.

హైదరాబాద్, మహా.

సమాజంలో దైవంతో సమానంగా పూజించే వైద్య వృత్తిలోకి అడుగుపెడుతున్న విద్యార్థులు, భవిష్యత్తులో కార్పొరేట్ శక్తుల ప్రభావానికి లోనుకాకూడదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హితవు పలికారు. కరీంనగర్‌లోని ప్రతిమ వైద్య కళాశాల 24వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన, వైద్య విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఫార్మా కంపెనీలు, డయాగ్నస్టిక్ సెంటర్ల ప్రలోభాలకు లొంగిపోయి పేద ప్రజలకు అన్యాయం చేయవద్దని కోరారు. వైద్య రంగంలో కొత్తగా వస్తున్న మార్పులను గమనిస్తూ అప్‌డేట్ కాకపోతే, సినిమాల్లో చూపించే ‘శంకర్ దాదా’ పాత్రల్లా మారే ప్రమాదం ఉందని, అదే జరిగితే రోగులను కాపాడటం బదులు వైకుంఠానికి పంపినట్లవుతుందని చమత్కరించారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు ప్రతిమ వైద్య కళాశాల అందిస్తున్న సేవలను బండి సంజయ్ ఈ సందర్భంగా ప్రశంసించారు. గత 24 ఏళ్లుగా ఈ సంస్థ ఎంతో ఎత్తుకు ఎదిగిందని, ముఖ్యంగా ‘తల్లి బిడ్డ సంక్షేమ పథకం’ ద్వారా కేవలం రెండు వేల రూపాయలకే గర్భిణీలకు కాన్పు వరకు పూర్తి వైద్యం అందిస్తుండటం అభినందనీయమని అన్నారు. ఇక్కడ చదువుతో పాటు విలువలకు కూడా ప్రాధాన్యత ఇస్తుండటం వల్లే సీట్లకు ఇంత డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు.
వైద్య విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంబీబీఎస్ చదువును ట్వంటీ-20 మ్యాచ్‌తో పోల్చలేమని, ఇది ఐదేళ్ల పాటు సాగే టెస్ట్ మ్యాచ్ లాంటిదని అభివర్ణించారు. రాత్రులు నిద్రలేకుండా చదవడం, క్లిష్టమైన సబ్జెక్టులతో కుస్తీ పడటం, మానసిక ఒత్తిడికి గురవ్వడం ఇవన్నీ ఒక వైద్య విద్యార్థి జీవితంలో భాగమేనని చెప్పారు. అయితే, భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని బతికించినప్పుడు కలిగే తృప్తి ముందు ఈ కష్టాలన్నీ చిన్నవిగా అనిపిస్తాయని విద్యార్థులలో ధైర్యం నింపారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. గతంలో ఒక ర్యాలీలో గుండెపోటుతో కుప్పకూలినప్పుడు, కరీంనగర్ వైద్యులే తనను కాపాడారని తెలిపారు. ఆ సమయంలో తనకు 12 సార్లు షాక్ ఇచ్చారని, ఐదు రోజుల పాటు ఐసీయూలో ఉంచి పునర్జన్మ ప్రసాదించారని చెప్పారు. అమ్మ జన్మనిస్తే, డాక్టర్లు పునర్జన్మనిస్తారనడానికి తానే నిదర్శనమని, అందుకే వైద్యులంటే తనకు అమితమైన గౌరవమని పేర్కొన్నారు.
అయితే, కోవిడ్ సమయంలో కొన్ని ఆసుపత్రులు మానవత్వం మరిచి ప్రవర్తించడం బాధాకరమని అన్నారు. డబ్బు చెల్లించలేదని చికిత్స నిలిపివేసిన ఘటనలు పునరావృతం కాకూడదని ఆకాంక్షించారు. దేశంలో వైద్య సదుపాయాల కొరత గురించి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పాలకులు ఈ రంగాన్ని విస్మరించారని విమర్శించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన పడకల సంఖ్యకు, మన దేశంలో ఉన్నవాటికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు ఇంకా మెరుగుపడాల్సి ఉందని, అక్కడి మౌలిక వసతులను ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తే డాక్టర్లు పల్లెల్లో సేవ చేయడానికి ముందుకొస్తారని అభిప్రాయపడ్డారు.
ఎంబీబీఎస్ తర్వాత పీజీ సీట్ల కొరత, అధిక ఫీజుల భారం వల్ల చాలామంది ప్రతిభావంతులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, దీనిపై విధానపరమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. ఏ రంగంలోనైనా నిజాయితీ, నిబద్ధత ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, ఇందుకు తానే ఉదాహరణని చెప్పారు. ప్రజల పక్షాన పోరాటం చేయడం వల్లే తనపై వందకు పైగా కేసులు నమోదయ్యాయని, ఆ పోరాట పటిమే తనను కేంద్ర మంత్రిగా నిలబెట్టిందని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు.

Latest