నమ్మి మోసపోయా.. క్షమించండి.
* అప్పుల బాధ, వేధింపులతో దంపతుల ఆత్మహత్య.
* మధ్యవర్తిత్వమే మృత్యుపాశం.. బెజ్జంకిలో విషాదం.
* సూసైడ్ నోట్‌లో నలుగురి పేర్లు.. కేసు నమోదు.
హైదరాబాద్, మహా.
నమ్మకం ఓ కుటుంబాన్ని బలిగొంది. అప్పు వ్యవహారంలో మధ్యవర్తిగా ఉన్న పాపానికి అవమానాలు, వేధింపులు ఎదురవడంతో మనస్తాపం చెంది దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘‘అమ్మ నాన్నా.. తమ్ముడు.. అత్తమ్మ.. నన్ను క్షమించండి. నమ్మి మోసపోయా..’’ అంటూ లేఖ రాసి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష (32) బెజ్జంకి మండల కేంద్రంలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. గతంలో జరిగిన రూ.13 లక్షల అప్పు వ్యవహారంలో శ్రీహర్ష మధ్యవర్తిగా వ్యవహరించారు. ఈ క్రమంలో డబ్బులు తిరిగి చెల్లించాలంటూ అప్పు ఇచ్చిన వారు, సంబంధిత వ్యక్తులు శ్రీహర్షను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఒకవైపు డబ్బులు తిరిగి చెల్లించలేక, మరోవైపు వేధింపులు, అవమానాలు భరించలేక శ్రీహర్ష తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు.
దీంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం అద్దె ఇంట్లో తన భార్య రుక్మిణి (25)తో కలిసి గడ్డి మందు తాగారు. కాసేపటికి తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో కింద పడిపోవడాన్ని గమనించిన వీరి కుమార్తె హరిప్రియ, ఏం జరిగిందో తెలియక భయంతో కేకలు వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా, అప్పటికే రుక్మిణి మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న శ్రీహర్షను, కుమార్తె హరిప్రియను చికిత్స నిమిత్తం హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీహర్ష పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
*సూసైడ్ నోట్ లభ్యం*
సంఘటనా స్థలంలో మృతుడు రాసిన సూసైడ్ నోట్ లభించిందని ఎస్సై సౌజన్య తెలిపారు. అప్పు విషయంలో రవికంటి అభిషేక్, పప్పుల రాజశేఖర్, వంగల భూపతిరెడ్డి, నాంపల్లి శ్రీనివాస్ తనను వేధించారని, వారి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రీహర్ష లేఖలో పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి వడ్లకొండ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.







