Mahaa Daily Exclusive

  రైతు కష్టాలు తీర్చేందుకే ‘యూరియా యాప్’.:రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

Share

* యూరియాపై విపక్షాలది విషప్రచారం.
* రైతు కష్టాలు తీర్చేందుకే ‘యూరియా యాప్’.
* కేంద్రం ఆలస్యం చేసినా.. యూరియా సరఫరాలో వెనకడుగు వేయలేదు.
* రుణమాఫీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదు.
* రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో యూరియా సరఫరాపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన కేటాయింపులు ఆశించిన సమయానికి అందకపోవడం వల్లనే సరఫరాలో స్వల్ప ఇబ్బందులు తలెత్తాయని, అంతేకానీ రాష్ట్రంలో యూరియా కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పారదర్శకంగా, ఎక్కడా ఆటంకాలు లేకుండా ఎరువుల పంపిణీ చేపడుతోందని తెలిపారు. గడిచిన రెండు పంట సీజన్లలో ఎంతో సమర్థవంతంగా యూరియాను పంపిణీ చేశామని గుర్తు చేసిన మంత్రి, 2024 వానాకాలం సీజన్‌లో 9.66 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం ఉండగా, 2025లో అంతకంటే అధికంగా 9.79 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని గణాంకాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తగినంత నిల్వలు ఉన్నప్పటికీ, ప్రతిపక్ష నాయకులు రైతులను భయబ్రాంతులకు గురిచేస్తూ, వారిని ఒక్కసారిగా కొనుగోళ్ల కోసం ఉరుకులు పరుగులు పెట్టించేలా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరియా పంపిణీలో తీసుకురావాలనుకుంటున్న కొత్త యాప్ కేవలం రైతుల ప్రయోజనం కోసమేనని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఎరువుల కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా ఉండేందుకు, పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే కిసాన్ కపాస్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహించామని, అదే స్ఫూర్తితో యూరియా యాప్‌ను కూడా అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు, రైతులను మోసం చేసే అలవాటు ఉన్నవారికే ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా తప్పుగా కనిపిస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న వారికి యూరియా ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుందనే ప్రాథమిక అవగాహన కూడా లేకుండా స్వార్థ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలోని రుణమాఫీ వైఫల్యాలను ఈ సందర్భంగా మంత్రి ఎండగట్టారు. పదేళ్ల కాలంలో కేవలం లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికే అప్పటి ప్రభుత్వం నానా అవస్థలు పడిందని, ఐదేళ్ల సమయం తీసుకుని నాలుగు వాయిదాలలో సగం మందికి కూడా పూర్తిస్థాయిలో చేయలేకపోయారని గుర్తు చేశారు. అటువంటి నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే సాహసోపేతమైన నిర్ణయాలతో ‘రైతు ప్రభుత్వం’గా పేరు తెచ్చుకుందని, ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని ఉద్ఘాటించారు. ఇప్పటికే వ్యవసాయ రంగంలో అనేక సాంకేతిక మార్పులు ప్రవేశపెట్టామని, తెలంగాణ విజన్ 2047 లక్ష్యానికి అనుగుణంగా భవిష్యత్తులో రైతాంగాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భరోసా ఇచ్చారు.

Latest