Mahaa Daily Exclusive

  నల్లబంగారు తల్లికి 105 ఏళ్లు..

Share

* నల్లబంగారు తల్లికి 105 ఏళ్లు..
* గోదావరి గర్భంలో మరో వందేళ్ల వెలుగులు
* అక్షయ పాత్ర సింగరేణి.. పాతాళంలో 21 వేల మిలియన్ టన్నుల సిరులు
* చరిత్రకు సాక్ష్యం.. భవిష్యత్తుకు మార్గం.
* ఆస్ట్రేలియా సాంకేతికతతో కొత్త శకం
* బెల్లంపల్లికి పునర్జన్మ.. మళ్లీ సిరుల ప్రవాహం.
* సింగరేణి అన్వేషణలో అద్భుతాలు
* ఇది బొగ్గు కాదు.. జాతి సంపద.
* నవశకంలోకి సింగరేణి ప్రస్థానం.
* నేటితో సరిగ్గా 105 వసంతాలు పూర్తి.

ఖమ్మం బ్యూరో, మహా.

అదొక సంస్థ మాత్రమే కాదు.. కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే దివ్య జ్యోతి. లక్షలాది మంది కార్మికుల స్వేదానికి, శ్రమశక్తికి నిలువుటద్దం. తెలంగాణ గడ్డపై నల్ల బంగారాన్ని వెలికితీస్తూ దేశ పారిశ్రామిక రంగానికి ఊపిరి పోస్తున్న ‘సింగరేణి’ ప్రస్థానం ఒక అద్భుతం. 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ సంస్థ.. ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’గా అవతరించి నేటితో (డిసెంబర్ 23) సరిగ్గా 105 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. గోదావరి లోయ గర్భంలో దాగి ఉన్న దాదాపు 21,464 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికితీస్తూ.. మరో వందేళ్ల పాటు ఉత్పత్తికి ఢోకా లేదని, వెలుగులకు లోటు లేదని సగర్వంగా చాటిచెబుతోంది. ఈ చారిత్రక సందర్భంలో సింగరేణి గడిచిన మైలురాళ్లు, భవిష్యత్తు అన్వేషణలు, పాతాళంలో దాగి ఉన్న సంపదపై *’మహా పత్రిక’* ప్రత్యేక కథనం.

సింగరేణి చరిత్ర పుటలను తిరగేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. 1870లోనే బ్రిటిష్ శాస్త్రవేత్త విలియం కింగ్ చేసిన పరిశోధనలే ఈ మహా వృక్షానికి బీజం వేశాయి. ఆ పరిశోధనల ఫలితంగా 1886లో ఇల్లెందులో తొలిసారిగా తవ్వకాలు మొదలుకాగా 1889లో పూర్తిస్థాయి వాణిజ్యపరమైన బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. కాలక్రమంలో విస్తరిస్తూ 1920 డిసెంబర్ 23న ఈ సంస్థకు ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’గా నామకరణం చేశారు. నాటి నుంచి నేటి వరకు 105 ఏళ్లుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఈ సంస్థ 1928లో బెల్లంపల్లి, 1937లో కొత్తగూడెం, 1961లో రామగుండం ప్రాంతాలకు విస్తరించి ప్రస్తుతం 18 ఓపెన్‌కాస్ట్, 22 భూగర్భ గనులతో వెలుగులు పంచుతోంది.

*అన్వేషణలో అత్యాధునిక సాంకేతిక విప్లవం*

కాలం మారుతున్న కొద్దీ సింగరేణి తన రూపురేఖలను మార్చుకుంటోంది. ఒకప్పుడు బొగ్గును వెలికితీయడం అసాధ్యం అనుకున్న చోట ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో అద్భుతాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా 600 నుంచి 1500 మీటర్ల లోతులో ఉన్న క్లిష్టమైన బొగ్గు పొరలను వెలికితీసేందుకు ‘భూగర్భ బొగ్గు వాయుకీకరణ’ (అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్), ‘కోల్‌బెడ్ మీథేన్’ వంటి వినూత్న పద్ధతులను అమలు చేస్తోంది. దీనికోసం ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సంస్థ ‘సీఎస్ఐఆర్వో’తో చేతులు కలిపింది. రామగుండంలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో ఈ సాంకేతికతను ఉపయోగించి జియో టెక్నికల్, హైడ్రో జియోలాజికల్ పరీక్షలు, 30 పెర్మియబిలిటీ పరీక్షలు నిర్వహించి విజయవంతం కావడం దేశ బొగ్గు చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. రామగుండం అడ్రియాల లాంగ్‌వాల్ బ్లాక్-17లో ఏకంగా 77.5 మీటర్ల నుంచి 522 మీటర్ల లోతు వరకు బోర్లు వేసి ఇన్‌సిటూ స్ట్రెస్ మెజర్‌మెంట్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడం సింగరేణి సాంకేతిక పటిమకు నిదర్శనం.

*అంచనాలకు మించిన నిల్వలు.. జిల్లాల వారీగా లెక్కలివే!*

సింగరేణి అన్వేషణ విభాగం జరిపిన సర్వేలో గోదావరి లోయ గర్భంలో ఊహించని స్థాయిలో బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. మొత్తం 21,464 మిలియన్ టన్నుల నిల్వలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆరో స్థానంలో నిలిచింది. జిల్లా వారీగా పరిశీలిస్తే.. మంచిర్యాల జిల్లా అత్యధికంగా 3,305.11 మిలియన్ టన్నులతో అగ్రస్థానంలో నిలవగా.. భద్రాద్రి కొత్తగూడెం 2,801.26 మిలియన్ టన్నులతో రెండో స్థానంలో ఉంది. పెద్దపల్లిలో 1,894.02, భూపాలపల్లిలో 1,717.77, ఆసిఫాబాద్‌లో 623.63, ఖమ్మం జిల్లాలో 504.76 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. పొరుగు రాష్ట్రంలోని చింతలపూడి ఉప పరివాహక ప్రాంతంలోనూ బొగ్గు ఆనవాళ్లు లభించడం విశేషం. దొరికిన నిల్వల్లో అత్యధికం ‘జీ-గ్రేడ్’ (జీ-7, జీ-8) రకానికి చెందిన బొగ్గు కాగా.. అత్యున్నత నాణ్యత గల ‘ఏ-గ్రేడ్’ బొగ్గు 108 మిలియన్ టన్నుల వరకు ఉంది.
బెల్లంపల్లికి పూర్వవైభవం: రెండో తల్లికి ఊపిరి
ఉత్తర తెలంగాణలో సింగరేణి విస్తరణకు నాంది పలికి.. ‘రెండో తల్లి’గా కార్మికులు పిలుచుకునే బెల్లంపల్లి ప్రాంతం ఒక దశలో కనుమరుగవుతుందనే ఆందోళన వ్యక్తమైంది. అయితే తాజా పరిశోధనలు ఆ ప్రాంతానికి మళ్లీ జీవం పోశాయి. బెల్లంపల్లి షాఫ్ట్ బ్లాక్-1 నుంచి 4 వరకు జరిపిన అన్వేషణలో భారీ నిల్వలు బయటపడ్డాయి. ముఖ్యంగా 1997 నుంచి 2010 మధ్య జరిపిన సర్వేల్లో బ్లాక్-1లో 63.88, బ్లాక్-2లో 80.45, బ్లాక్-3లో 85.67, బ్లాక్-4లో 75 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించారు. నెన్నెల మండలం శ్రావణపల్లిలో, గోలేటి మెగా ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతం మళ్లీ సిరుల మాగాణిగా మారబోతోంది. గోలేటిలో 1,358 హెక్టార్ల విస్తీర్ణంలో 39 మిలియన్ టన్నుల బొగ్గు ఉండటం.. మూసివేసిన గనుల్లోనూ ఇంకా బొగ్గు మిగిలి ఉండటంతో అక్కడ కొత్త ప్రాజెక్టులకు మార్గం సుగమమైంది.

*శాస్త్రీయ అన్వేషణ.. బయ్యారం బాధ్యత*

భూమి లోపల దాగి ఉన్న సంపదను గుర్తించేందుకు సింగరేణి అత్యంత శాస్త్రీయ పద్ధతులను పాటిస్తోంది. కిలోమీటర్‌కు ఒక బోరు చొప్పున వేసి.. ఆ తర్వాత ప్రతి 400 మీటర్లకు ఒక బోరు వేస్తూ గరిష్టంగా 800 మీటర్ల లోతు వరకు రంధ్రాలు చేస్తోంది. దీనివల్ల బొగ్గు నాణ్యత, మందం, లోతుపై స్పష్టమైన అవగాహన వస్తోంది. సింగరేణి సామర్థ్యంపై నమ్మకంతోనే ప్రభుత్వం బయ్యారం ఇనుము ఖనిజ అన్వేషణ బాధ్యతలను కూడా ఈ సంస్థకే అప్పగించింది. కేవలం బొగ్గు వెలికితీయడమే కాకుండా భూగర్భ జలాల అధ్యయనం, జియో ఇంజనీరింగ్, జియోలాజికల్ మోడలింగ్ వంటి క్లిష్టమైన అంశాల్లోనూ సింగరేణి తనదైన ముద్ర వేస్తోంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ.. ఆధునిక సాంకేతికతను జోడించుకుని మరో వందేళ్ల ప్రస్థానానికి సిద్ధమైంది. దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి పాత్ర అనిర్వచనీయం.

Latest