- సానుభూతి కోసం రేవంత్ బూతులు
- సీఎం స్థాయికి తగ్గ మాటలు కావు
- కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టిన శని
- కృష్ణా జలాలపై కేసీఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేశారు
- చట్టం లోని లొసుగులను ఆసరా చేసుకుని అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ మంత్రులు
- ఇంటెలీజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నాం
- త్వరలోనే మంత్రుల అవినీతిని బయట పెడతాం
- కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా : కృష్ణా జలాల విషయంలో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కుమ్మక్కై తెలంగాణకు కేసీఆర్ ద్రోహం చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆయన నుంచి ముడుపులు అందుకున్నారని ఆరోపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు పట్టిన శని అని వ్యాఖ్యానించారు. ప్రజల్లో రోజురోజుకూ విశ్వాసం కోల్పోతున్న సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి రావాలని చెప్పి కేసీఆర్ ను బూతులు తిడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష బాగాలేదన్నారు. మీడియా ప్రతినిధులతో గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ట్‌చాట్‌లో మాట్లాడిన బండి సంజయ్
కోస్గీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందించారు. ఆయన కేసీఆర్ పైనా ఆయన కుటుంబంపై వాడిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం సరైంది కాదన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాంటి భాష మాట్లాడి వ్యతిరేకత తెచ్చుకున్నారన్నారు. అప్పట్లో కూడా ఆయన భాషపై తాను అభ్యంతరం వ్యక్తం చేశానన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా భాషను సరి చేసుకోవాలని సూచించారు. కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగింది కేసీఆర్ వల్లే అన్నారు. జగన్ తో కలిసి తీరని ద్రోహం చేశారన్నారు. 570 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే అంగీకరించి గొంతుకోశారన్నారు. ఈ విషయాన్ని అపెక్స్ కమిటీలో జగన్ చెప్పారని, కేసీఆర్ కావాలంటే ఆధారాలను సైతం బయటపెడతానన్నారు. ఇప్పుడు మరోసారి ప్రజలను మోసం చేయడానికి కృష్ణా జలాలను ఎంచుకున్నారని ఆరోపించారు. మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసింది కేసీఆర్ కుటుంబమేనని, రాష్ట్ర అభివృద్ధి జరగలేదు కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం బాగా అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని గ్రహించే ప్రజలు ఆయనను ఫాంహౌజ్ కు పంపించారన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. దీంతో నేతలంతా తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. పడిపోతున్న తన పార్టీని, బీఆర్‌ఎస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి బూతులు తిడుతున్నారని అన్నారు. దీని వల్ల కేసీఆర్‌కు సానుభూతి వస్తుందని అన్నారు. అందుకే రెండు పార్టీలు కుమ్మక్కై ఇలాంటి నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల ఆ పార్టీ నేతలే నిర్వేదంతో ఉన్నారన్నారు. రాష్ట్ర క్యాబినెట్ లోని ఇద్దరు ముగ్గురు మంత్రులు చట్టం లొసుగులను ఆసరాగా చేసుకుని అందినంత దండుకునే పనిని వేగ వంతం చేశారని వేలాది ఎకరాల భూములను అప్పనంగా నిక్రయించుకుంటున్నారన్నారు. ఆ మంత్రుల చిట్టాను కేంద్ర నిఘా వర్గాల నుంచి తెప్పించుకుంటున్నామని, వారందరి బాగోతాన్ని బయటపెడతామన్నారు. కాంగ్రెస్ కరప్షన్, అక్రమాలపై సమయాన్ని బట్టి బీజేపీ పోరాటం చేయబోతోందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలపైనా నివేదికలు తెప్పించుకుని పంపినా రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల స్కాం జరిగితే… 9 వేల కోట్ల అక్రమాలపైనే విచారణకు పరిమితం ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఎవరిని కాపాడేందుకు రూ.లక్ష కోట్ల అక్రమాలపై విచారణ జరపడం లేదన్నది రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. కేసీఆర్ సర్కార్ బాటలోనే రేవంత్ పాలన కొనసాగుతోందని సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ సర్కార్ కూడా జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదన్నారు.








