మేడిపల్లిలో ఈగల్ టీం మెరుపు దాడులు.
* ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణా.
* నలుగురు నిందితుల పట్టివేత
* చెంగిచెర్ల నివాసి నేతృత్వంలో నెట్‌వర్క్.
* 3 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.
మేడ్చల్, మహా.
రాజధాని శివార్లలో మాదకద్రవ్యాల సాగు, రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ టీం సభ్యులు, స్థానిక పోలీసులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేస్తూ నలుగురు పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా హైదరాబాద్‌లోని చెంగిచెర్లకు చెందిన పృథ్వీరాజ్ వ్యవహరిస్తున్నాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో తన ఉపాధిని కోల్పోయిన పృథ్వీరాజ్, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో గంజాయి వ్యాపారంలోకి దిగాడు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి తక్కువ ధరకే గంజాయిని సేకరించి, దాన్ని రహస్యంగా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. నగరంలోని యువతను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని పృథ్వీరాజ్ తన అనుచరులైన రాహుల్, అక్రం మరియు షఫీలతో కలిసి ఈ దందాను నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఒడిశా నుంచి సేకరించిన గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా విడగొట్టి, అవసరమైన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. పట్టుబడిన నలుగురిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.








